ప్రభుత్వశాఖలకు నత్తలతో పోటీ!
posted on Sep 25, 2012 8:52AM
.png)
వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన ఫైలు సచివాలయానికి వెళ్ళిందంటే ఇక అది ఎంత ముఖ్యమైనా సరే వారాలు, నెలల తరబడి అక్కడే పడి మూలగాల్సిందే. ఎంతోమందిని దాటుకుంటూ చాలాసార్లు వచ్చేసరికి ఏళ్లు కూడా గడిచిపోతుంటాయని వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ఇలా ఎన్నో ఫైల్స్ ఏళ్ళ తరబడి నిలిచిపోతుంటాయని చెబుతున్నారు. ఇదేం కొత్తేంకాదు. ఎందుకంటే ప్రభుత్వ శాఖలంటే సామాన్యుల దృష్టిలో అలసత్వానికి ప్రతీకలు. అటువంటి ప్రభుత్వ శాఖల్లో ఒకటైన వైద్య ఆరోగ్యశాఖకు నిర్లక్ష్యం అనే జబ్బు చేయడం కొత్తేమీకాదు. అలాగని మిగిలిన శాఖలకు ఈ జబ్బు లేదని కాదు. నిర్లక్ష్యం అన్నది ప్రభుత్వశాఖలకు ఉన్న ఓ ప్రధానమైన కుదర్చలేని జబ్బు! నేతలు తమకు కావలసిన వారికి సంబంధించిన ఫైల్స్, లేదా పరోక్షంగా తమకు చెందిన ఫైల్స్, పార్టీకి సహకరించే పెద్దల ఫైల్స్ అయితే వేగంగా కదులుతాయని సామాన్యులు చెప్పుకునే మాట. ఎందుకంటే క్రిందిస్థాయినుండి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులంటే నత్తతో పోటీపడుతుంటాయని జగమెరిగిన సత్యమని కూడా సగటుమనిషి చెబుతుంటాడు.