జయ తల్లి..మరి శోభన్ బాబు తండ్రి కాదా?

 

బ్రతికుండగా లేని బంధాలు చనిపోయాక పేరు కోసమో,ఆస్తికోసమో వచ్చి వాలిపోతాయి.తమిళనాడు ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్న జయలలిత మరణమే కాదు,జీవితం కూడా ఊహకందని మర్మము.జయలలిత మరణాంతరం బెంగళూరుకి చెందిన అమృత జయ తనకు జన్మనిచ్చిన తల్లి అని, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని, ఆమె భౌతికకాయానికి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించింది.తను జయ, దివంగత నటుడు శోభన్‌బాబుకు జన్మించినట్లు తన కుటుంబీకులు చెప్పారని పేర్కొంది.

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్‌ శోభన్‌బాబును తన తండ్రిగా ప్రకటించాలని ఎందుకు కోరడం లేదని, కేవలం జయలలిత తన తల్లి అని ప్రకటించాలనే ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు.దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని వైద్యనాథన్ ఆదేశించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది అమృత జయ కుమార్తె కాదని, అందుకు సంబంధించిన వీడియో ఆధారాలను న్యాయస్థానం ముందుంచారు.ఇరువాదనలు విన్న వైద్యనాథన్‌ జయ జీవితమంతా ఓ మిస్టరీగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు.అమృత వేసిన పిటిషన్ ను కొట్టివేశారు.