తిరిగి కాంగ్రెస్ లోకే హర్షకుమార్?

 

 

 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి శాయశక్తులా కృషి చేసిన వాళ్ళలో అమలాపురం ఎంపీ హర్షకుమార్ కూడా ఒకరు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నారు. చివరికి అనుచరులు ‘సమైక్యసింహం’ అని పిలుచుకునే కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీలో చేరారు. ఈ పార్టీలో హర్ష కుమార్ ప్రస్తుతం చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నిన్నటి వరకూ అంతా బాగానే వుందిగానీ, లేటెస్ట్ గా పరిస్థితిలో తేడా వచ్చినట్టు కనిపిస్తోంది.

 

హర్షకుమార్ మెల్లగా జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి జారిపోతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, తనకి దిగ్విజయ్ సింగ్ నుంచి ఫోన్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఆయన తనను రిక్వెస్ట్ చేశారని హర్షకుమారే స్వయంగా చెప్పారు. అయితే తనంతట తాను కాంగ్రెస్‌లో నుంచి బయటకి రాలేదని, కాంగ్రెసే తనని బహిష్కరించిందని తాను దిగ్విజయ్‌కి చెప్పానని హర్షకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మొదట తనమీద వున్న బహిష్కరణను తొలగించాలని తాను దిగ్విజయ్‌కి చెప్పానని హర్షకుమార్ వెల్లడించారు.



ఈ వార్త బయటకి రాగానే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం రేగింది. జై సమైక్యాంధ్ర పార్టీలో కలకలం మొదలైంది.  హర్షకుమార్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోతున్నారన్న వార్త గుప్పుమంది. దాంతో కంగారు పడిన హర్ష కుమార్ మళ్ళీ మరో ప్రకటన చేశారు. తాను  అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని, అది కూడా ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ నుంచే పోటీ చేస్తానని వివరణ ఇచ్చారు. అయితే హర్షకుమార్ జై సమైక్యాంధ్ర పార్టీకి బై చెప్పి, కాంగ్రెస్‌కి జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.