గుర్మీత్ కు వీఐపీ ట్రీట్ మెంట్...చెప్పిన మరో ఖైదీ

 

గుర్మీత్ బాబా అలియాస్ డేరా బాబా ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా బాబాను అరెస్ట్ చేసి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇక ఆ తరువాత డేరా బాబా గురించిన పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన రోహ్ తక్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే ఇప్పుడు జైల్లో ఉన్న డేరాబాబాకు సంబంధించి మరో విషయం బయటపడింది. అదేంటంటే.. జైల్లో గుర్మీత్ కు వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. అదే జైల్లో ఉన్న మరో భైదీ. ఇదే జైల్లో శిక్షను అనుభవిస్తున్న  రాహుల్... బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా మీడియా  అతన్ని డేరాబాబా గురించి అడుగగా....  జైల్లో గుర్మీత్ సింగ్ ను తానే కాదు.. ఇతర ఖైదీలు కూడా చూడలేదని... మిగతా ఖైదీలంతా రోజూ పనులు చేస్తుంటే... గుర్మీత్ అక్కడకు కూడా రావడం లేదని తెలిపాడు. గుర్మీత్ జైలుకు వచ్చిన తర్వాత తమకు కఠిన నిబంధనలు విధించారని, అతనికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారని చెప్పాడు. తమను ఎవరైనా చూడ్డానికి వస్తే కేవలం 20 నిమిషాల పాటే మాట్లాడనిస్తారని... గుర్మీత్ ను కలవడానికి ఎవరైనా వస్తే మాత్రం రెండు గంటలపాటు మాట్లాడనిస్తారని తెలిపాడు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.