గెలుపుతో పాటు షాక్ కూడా..?

2014లో అధికారాన్ని అందుకున్నది మొదలు జరిగిన ప్రతి ఉప ఎన్నికలో గెలుపొందుతూ వస్తోన్న మోడీ-అమిత్‌షా ద్వయానికి త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం బీజేపీదేనని చాలా సర్వేలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ వీరిద్దరూ ఎందుకో టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గుజరాత్‌లో గెలుపు ఓటముల పైనే మోడీ, అమిత్‌షాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ పండితుల విశ్లేషణ. ఈ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే వీరిద్దరికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

ఇప్పటికే యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ వంటి వారు అసంతృప్తి రాగాలు వినిపించడంతో ఈ ఎన్నికలను వీరిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుని.. ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ కీలక సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది. పాజిటివ్ టాక్‌ను ఇచ్చిన ఈ సర్వే.. మరోవైపు కాషాయ దళానికి మొట్టికాయలు కూడా వేసింది. బీజేపీ ఆరోసారి కూడా అధికారంలోకి రానుంది ఏబీపీ-సీఎస్‌డిఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే ఓట్ల శాతం బాగా తగ్గుతుందని తెలిపింది.

 

బీజేపీకి 113 నుంచి 121 సీట్లు, కాంగ్రెస్‌కు 58 నుంచి 64 వరకు సీట్లు లభించే అవకాశాలున్నాయని తెలిపింది. గత ఆగస్టులో ఇదే ఏబీపీ-సీఎస్‌డిఎస్ నిర్వహించిన సర్వేతో పోలిస్తే అక్టోబర్‌ సర్వే అంచనాలు కమలనాధులకు కొంత వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆగస్టు నాటి సర్వేలో బీజేపీ సీట్లు గతంతో పోలిస్తే కొంత మెరగవ్వొచ్చునని నిర్వాహకులు అభిప్రాయపడగా.. తాజా సర్వేలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. అలాగే ఓట్ల శాతం కూడా ఆగస్టులో 59 శాతం ఉంటే అక్టోబర్ నాటికి 47 శాతానికి తగ్గింది. ఇది సీట్ల సంఖ్యపై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

దాదాపు 25 ఏళ్లపాటు వెన్నుదన్నుగా నిలిచిన పటేళ్లు బీజేపీపై గుర్రుగా ఉండటానికి తోడు.. చిన్న, సన్నకారు వ్యాపారులంతా జీఎస్టీతో కుదేలయ్యారు. దీంతో రాష్ట్రంలోని మెజారిటీ వ్యాపారస్తులు కమలానికి ఓటు వేయకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే విషయం సర్వేలో స్ఫష్టంగా కనిపించింది. సో.. పరిణామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మోడీ- షా కాస్త అప్రమత్తతతో వ్యవహరిస్తే దేశంలో మోడీ హవాకి అడ్డులేదని చెప్పుకుంటూ సార్వత్రిక రణరంగంలోకి కాలర్ ఎగరేసుకుని అడుగుపెట్టవచ్చు.