ఎంత లేటయితే.. అంత గ్రేటు....!
posted on Sep 12, 2012 9:56AM
ఒకప్పుడు ఏమోకాని ఇప్పుడు మాత్రం పేదవాడికి సెంటు భూమి అందిందంటే అందరికీ ఇట్టే తెల్సిపోతుంది! అదే ఏ పారిశ్రామికవేత్తో రాజకీయనాయకుడో వేల ఎకరాలు అందుకున్నాడనుకోండి (పేరుకు కంపెనీలు కోసమని చెప్పడం రివాజు) దానిగురించి ఎప్పటికోగాని తెలియదు. అప్పటికి సదరు వ్యక్తులు పెట్టిన పెట్టుబడి లాభం రానే వస్తుంది. ఇలా వుంటుంది నేటి పాలకన్యాయం. వివిధ రాష్ట్రాలకు సంబంధించి 24 లక్షల ఎకరాల ‘భూదాన’ భూములకు సంబంధించిన రికార్డులు గల్లంతవడంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈనెల 20న ఢల్లీిలో జరగనున్న రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
వినోభా భావే 1951లో చేపట్టిన భూదానోద్యమంలో 48 లక్షల ఎకరాల భూములను ‘భూదానం’ కింద భూములు లేని పేదలకు దానం చేయగా, అందులో సగం భూములు మాత్రమే ఇప్పటివరకు పేదలకు పంపిణీ అయ్యాయని, అలాగే మిగిలిన భూముల సమస్యలు సంక్లిష్టమైనవని గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి జైరాం రమేష్ అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా కొన్ని భూముల్లో వున్న సంక్లిష్టమైన విషయాలను ఇంతవరకూ పరిష్కరించలేదంటే లోపం ఎక్కడుంది? పాలకుల్లోనా? ఆ భూముల్లోనా? ఇచ్చిన దాతల్లోనా? తీసుకున్న గ్రహీతల్లోనా..?! ఇదంతా చూస్తే ‘నే ఎక్కే బండి జీవితకాలం లేటు..’ అన్న సామెత గుర్తుకువస్తోంది కదూ...!