తిరుగులేని విజయం!


 

గ్రేటర్‌ ఎన్నికలలో తెరాస వీరాభిమానులు కూడా ఊహించని విధంగా ఆ పార్టీ ఇప్పడు దాదాపు 110 స్థానాలకు చేరువకు వచ్చేసింది. 30కి పైగా స్థానాలతో మజ్లిస్‌ రెండో స్థానాన్ని కైవలం చేసుకుంది. ఇక బీజేపీ, తెదేపా, కాంగ్రెస్‌లకు ఘోర పరాజయమే మిగిలింది. తెరాస, మజ్లిస్‌ మినహా మరే పార్టీ కూడా రెండంకెలను చేరుకోలేని దీన పరిస్థితిలో ఉన్నాయి. తెరాస తప్ప తమకు మరో దారి లేదనుకున్నారో, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అనుకున్నారో, కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉపయోగం లేదనుకున్నారో… ప్రజలు ఏమనుకున్నా కానీ ఫలితాలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

ఇక ఈ విజయాన్ని తెరాస ఎలా భావిస్తుందన్నదే అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. తమకు తిరుగులేదు కాబట్టి నిరంకుశ ధోరణితో ముందుకు వెళ్తుందా? లేకపోతే ఎదుగుదలతో ప్రజల పట్ల ఒదిగి ఉంటుందా?... అన్నది కొద్ది నెలలలోనే తేలిపోతుంది. హైదరాబాద్‌ ప్రజలు ఈ విజయాన్ని ఎప్పటి నుంచో ఊహిస్తూనే ఉన్నారు. అయితే గ్రేటర్‌ పీఠం మీద బలమైన అధికార పక్షం ఉండటం వల్ల వారికి ఎంత ఉపయోగం ఉంటుందో అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితి కూడా అంత క్షేమకరం కాదు. మరి ఇలాంటి సందర్భంలో ప్రజల తరఫున ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మజ్లిస్‌ ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడుతుందా లేక పాతబస్తీకే అది పరిమితమవుతుందా అన్నది కూడా వేచిచూడాల్సిందే.

గ్రేటర్‌ ఎన్నికలలో ఒక్కటి మాత్రం స్పష్టంగా తేలిపోయింది. హైదరాబాదు ప్రజలంతా కూడా ముక్తకంఠంతో తమకు తెరాస వస్తేనే ప్రయోజనం అన్న అభిప్రాయాన్ని తెలియచేశారు. మరి ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవల్సిన బాధ్యత అధికార పార్టీకి ఎంతైనా ఉంది. హైదరాబాదు ప్రజలకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలికమైన సదుపాయాలు కూడా వారికి ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి. వీటన్నింటినీ తెరాస ఎంతవరకూ పరిష్కరించగలుగుతుందో చూడాలి. మరోవైపు తమ పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా మారిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరం ప్రతిపక్షాలకి ఏర్పడింది.