టీడీపీ నేత గాలి మద్దుకృష్ణమ నాయుడు కన్నుమూత

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గత కొంత కాలంగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో జన్మించిన గాలి... ఉన్నత విద్యను అభ్యసించారు.. బీఎస్సీతో పాటు ఎంఏ, ఎల్ఎల్‌బీ పట్టా పొందారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోన్న రోజుల్లో ఎన్టీఆర్ పిలుపుతో 1983లో ముద్దు కృష్ణమ తెలుగుదేశం పార్టీలో చేరారు. పుత్తూరు నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యా, అటవీశాఖ, ఉన్నత విద్యా శాఖా మంత్రిగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఓడిపోయి.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడే గాలి తెలుగు రాష్టాల ప్రజలకు సుపరచితులు. ఆయన మరణం పట్ల టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు నేతలు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.