ఈట‌ల‌కు స‌న్ స్ట్రోక్‌!.. అంతా ఆయ‌నే చేస్తున్నారా?

ఈట‌ల రాజేంద‌ర్‌. అధిప‌త్యంపై పోరాడే యోధుడు. ఆనాడు రాజ్య దుర‌హంకారానికి వ్య‌తిరేకంగా.. ఎర్ర‌జెండా చేత‌ప‌ట్టి న‌క్స‌లిజంతో తుపాకీ రాజ్యం తీసుకురావాల‌ని అన్న‌ల వెంట‌ అడ‌వి బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత‌ ప్ర‌త్యేక రాష్ట్రం కోసం గులాబీ జెండా క‌ప్పుకొని.. కేసీఆర్‌తో చేతులు క‌లిపి.. స్వ‌రాష్ట్ర స్వ‌ప్నం సాకారం చేశారు. రెండు ద‌శాబ్దాల ఆ అనుబంధం.. ఇటీవ‌ల అవ‌మాన‌క‌రంగా ముగిసింది. స్వ‌తంత్ర భావాజాలం అధికంగా ఉండే రాజేంద‌ర్‌.. బాంచెన్ దొర అంటూ సేవ‌కుడిలా అణిగిమ‌నిగి ఉండ‌లేక‌పోయాడు. అందుకే, పార్టీపై రెబెల్ జెండా ఎగ‌రేశారు. మంత్రిమండ‌లి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ అయ్యారు. ఈట‌ల స్వ‌భావం తెలిసిన వారెవ‌రైనా.. ఆయ‌న‌ సొంత పార్టీ దిశ‌గా అడుగులు వేస్తార‌ని అనుకున్నారు. కొత్త పార్టీతో, బీసీ ఎజెండాతో.. కేసీఆర్‌పై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతార‌ని భావించారు. ఈట‌ల సైతం కొత్త పార్టీతో తెలంగాణ‌లో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ చేసేందుకు క‌స‌ర‌త్తు చేశారు. కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, కోదండ‌రాం, తీన్మార్ మ‌ల్ల‌న్న లాంటి భావ‌స్వారుప్య నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. కొత్త పార్టీకి జెండా, ఎజెండా ఖ‌రారు అయ్యే స‌మ‌యంలో సీన్ రివ‌ర్స్ అయింది. పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అమాంతం మారిపోయింది. అందుకు కార‌ణం.. బ‌ల‌మైన బీసీ నాయ‌కుడైన‌ ఈట‌ల రాజేంద‌ర్ కుమారుడు నితిన్‌రెడ్డి.

అవును, ఈట‌ల ఒక‌టి త‌లిస్తే.. ఆయ‌న కొడుకు నితిన్‌రెడ్డి మ‌రొక‌లా స్కెచ్ వేశాడు. త‌న‌పై, త‌న తండ్రిపై భూక‌బ్జా కేసులు పెట్టిన కేసీఆర్‌పై కోపంతో ర‌గిలిపోతున్నారు. అన్నేళ్లు త‌న తండ్రి ఉద్య‌మానికి, పార్టీకి అంత సేవ చేస్తే.. ఇంత దారుణంగా కేబినెట్‌లోంచి వెళ్ల‌గొడ‌తారా? ఇంత ఘోరంగా త‌మ భూముల‌పై కేసులు, క‌మిటీలు వేస్తారా? అంటూ నితిన్‌రెడ్డి కాక మీదున్న‌ట్టు తెలుస్తోంది. యంగ్‌స్ట‌ర్ క‌దా.. అందుకే దూకుడుతో పాటు తెలివి కూడా ఎక్కువే. కేసీఆర్‌పై ప‌గ మాత్ర‌మే ఉంటే స‌రిపోద‌ని.. స‌రైన రీతిలో ప్ర‌తీకారం తీర్చుకోవాలంటే.. స‌రైన స‌మ‌యం, స‌రైన స‌పోర్ట్ అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నారు. 

కొండంత కేసీఆర్‌ను ఒంట‌రిగా పిండి చేయ‌డం కంటే.. బ‌ల‌మైన జాతీయ పార్టీతో చేతులు క‌లిపి.. క‌లిసిక‌ట్టుగా క‌ల‌బ‌డితే బెట‌ర్ అంటున్నారు. అందుకే, ఇప్ప‌టికిప్పుడు సొంతంగా పార్టీ పెట్టి.. కేసీఆర్‌పై పోరాడ‌టంకంటే.. బ‌ల‌మైన బీజేపీతో జ‌త క‌ట్ట‌డ‌మే రాజ‌కీయంగా స‌రైన ఎత్తుగ‌డ అంటూ.. తండ్రికి న‌చ్చ‌జెప్పార‌ట ఈట‌ల కుమారుడు. త‌న‌యుడి ఒత్తిడితోనే ఈట‌ల బీజేపీ నేత‌ల‌తో బాగా ట‌చ్‌లోకి వ‌చ్చార‌ట‌.రేపేమాపో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో భేటీ కాబోతున్నార‌ని తెలుస్తోంది. ఈట‌ల‌కు ఇష్టం లేక‌పోయినా.. కుమారుడి ఒత్తిడి మేర‌కు కాషాయ కండువా క‌ప్పుకోవాల‌ని ఈట‌ల ఫిక్స్ అయిపోయార‌ని చెబుతున్నారు. 

బీజేపీలో చేరాలా? వద్దా? అనే విషయమై ఈటల తన మద్దతుదారుల అభిప్రాయాల్ని మరోమారు అడిగినట్లు తెలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మద్దతుదారులు ఈటలను శామీర్‌పేటలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి నుంచి వస్తున్న ఒత్తిడి గురించి ఈట‌ల వారి ద‌గ్గ‌ర ప్ర‌స్తావించార‌ట‌. నితిన్‌రెడ్డి బీజేపీలో చేరాల‌ని ప్రెజ‌ర్ చేస్తున్నాడ‌ని.. తాను సైతం క‌మ‌ల‌ద‌ళంలో చేరాల‌ని భావిస్తున్నాన‌ని.. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ధీటుగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు అడుగులేస్తే బాగుంటుందనే భావనను ఆయన త‌న మ‌ద్ద‌తుదారుల ద‌గ్గ‌ర‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి పలువురు నాయకులు సమ్మతించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.    

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మూడు, నాలుగు రోజుల్లోపే బీజేపీలో ఈట‌ల‌ చేరిక ఉంటుందని చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాలో చేరనున్నారు. కొద్దిరోజులుగా కమ‌లం పార్టీ కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.బీజేపీలో చేరితే ఈట‌ల‌ పోరాటానికి పార్టీ అండగా ఉంటుందని ఛుగ్‌ చెప్పారు. రాష్ట్రానికి చెందిన ‘సంఘ్‌’ కీలక నేతతోనూ రాజేందర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈటల బయోడేటాను రాష్ట్ర పార్టీ జేపీ న‌డ్డాకు పంపించిందట‌. అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టే జ‌రిగితే.. ఈ వారంలోనే ఈట‌ల మెడ‌లో కాషాయ కండువా చూడొచ్చు. 

ఇక‌ ఈట‌ల‌తో కోదండ‌రాం, కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డిలు స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఈట‌ల‌కు మొద‌టి నుంచీ మ‌ద్ద‌తుగా ఉంటున్న ఈ ముగ్గురు.. ఈట‌ల‌తో పాటే కాషాయ తీర్థం తీసుకుంటారా?  లేక‌, ప్ర‌స్తుతానికి ఈట‌ల ఒక్క‌రే బీజేపీలో చేరుతారా? అనేది ఆస‌క్తిక‌రం. అయితే, ఆ భేటీ త‌ర్వాత కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతానికి కొత్త పార్టీపై తొంద‌రేమీ లేద‌న్న‌ట్టు ప్ర‌క‌టించడం ఆస‌క్తిక‌రం. అంటే, ఈట‌ల నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటు అట‌కెక్కిన‌ట్టే అంటున్నారు. ఈట‌ల త‌న‌యుడు నితిన్‌రెడ్డి ఎంట్రీతో.. రాజేంద‌ర్ రాజ‌కీయ ప్ర‌స్థానం అనూహ్య మ‌లుపు తిరిగిందని చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu