బీజేపీ గూటికి ఈట‌ల‌! కేసీఆర్ కోరుకున్నది ఇదేనా ?

బ‌ల‌మైన బీసీ వాయిస్‌.. ఇక‌పై కాషాయ వాయిస్‌గా మారిపోనుంది. ఈట‌ల రాజేంద‌ర్ భుజాల‌పై నుంచి గులాబీ కండువ తొల‌గిపోయి.. కాషాయ కండువ వ‌చ్చి చేరుతోంది. ఈట‌ల క‌మ‌లం తోట‌లో విక‌సించ‌బోతున్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ ప‌క్క సీట్లో కూర్చొనే ఈట‌ల రాజేంద‌ర్.. ఇక‌పై బండి సంజ‌య్ ప‌క్క సీట్లో ఆసీనులు కానున్నారు. అధికార పార్టీ ద‌ర్పం.. భారీగా మందీమార్బ‌లం ఉండ‌క‌పోయినా.. క‌మ‌లం దండే ఆయ‌నకు అండాదండా. 

కొత్త పార్టీతో సింహం.. సింగిల్‌గా వ‌స్తుంద‌నుకున్నారు. బీసీల‌ను ఏకం చేసి.. గ‌డీల పాల‌న‌కు వ్య‌తిరేకంగా దొర‌పై దండ‌యాత్ర చేస్తారని భావించారు. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కోదండ‌రాం సారు, తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. ఇలా భావ‌సారుప్యులంద‌రినీ క‌లుపుకొని.. క‌లిసిక‌ట్టుగా తెలంగాణ గ‌డ్డ‌పై కొత్త జెండా ఎగ‌రేస్తారంటూ లీకులొచ్చాయి. క‌నీసం.. కాంగ్రెస్‌లోనైనా క‌లిసిపోతార‌ని.. రేవంత్‌రెడ్డితో క‌లిసి.. కేసీఆర్ దుమ్ము దులిపేస్తార‌ని ఆశించారు. ఇలా ఎన్నెన్నో అనుకున్నారు.. అనుకున్న‌వ‌న్నీ అవుతాయాయేం. 

చివ‌రాఖ‌రికి ఈట‌ల ఇలా బీజేపీ తీర్థం కోసం ఢిల్లీ వెళ్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లే. కొద్ది రోజుల ముందు వ‌ర‌కూ.. స్వ‌యంగా ఈట‌ల సైతం తాను బీజేపీలో చేరాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలే. ఇదంతా.. కేసీఆర్ స్కెచ్ అని.. గులాబీ బాస్ ప‌న్నిన త్రిశూల వ్యూహంతోనే.. ఇలా జ‌రిగింద‌ని అంటున్నారు. ఈట‌లను చ‌క్ర‌బంధనంలో ఇరుకించి.. అందులో నుంచి బ‌య‌ట ప‌డేందుకు కేసీఆర్ వ‌దిలిన ఏకైక మార్గ‌మైన బీజేపీలో చేర‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఈట‌లకు తీసుకొచ్చార‌నేది విశ్లేష‌కుల మాట‌. 

కొత్త పార్టీ పెట్ట‌డ‌మంటే పాన్‌డ‌బ్బా పెట్టినంత ఈజీ కాదంటూ గ‌తంలోనే ఈట‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్‌. అయినా, ఈట‌ల వెన‌క్కి త‌గ్గ‌లే. కొత్త పార్టీ స‌న్నాహాలు మాన‌లే. చూసి చూసి.. ఈట‌ల‌పై వేటు వేసేశారు. కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసేశారు. కేసుల‌తో ఉక్కిరిబిక్కిరి చేసేశారు. పార్టీ నుంచి వెళ్ల‌గొట్ట‌క‌పోయినా.. ఆయ‌నే త‌నంత‌ట తాను వెళ్లిపోయేలా చేస్తున్నారు. రేపేమాపో ఈట‌ల టీఆర్ఎస్‌ను వీడ‌టం ఖాయం. సరే ఈటల బయటకైతే వస్తారు. మ‌రి, వాట్ నెక్ట్స్? ఈట‌ల ముందు మూడు ఆప్ష‌న్స్ ఉన్నాయి..  1. సొంత పార్టీ పెట్టడం. 2. కాంగ్రెస్‌లో చేర‌డం. 3.బీజేపీలో చేరడం.  ఈ మూడు ఆప్ష‌న్స్‌లో కేసీఆర్‌కు ఇష్ట‌మైన‌ది.. మూదో ఆప్ష‌న్ అయిన ఈట‌ల బీజేపీలో చేర‌డం. ఇప్పుడు స‌రిగ్గా అలానే జ‌రుగుతుండ‌టం కేసీఆర్ వ్యూహ ఫ‌లిత‌మే అంటున్నారు. కేసీఆర్ కేబినెట్ నుంచి గెంటేశాక‌.. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు ఈట‌ల స‌న్నాహాలు ముమ్మ‌రం చేశారు. ఆ విష‌యం తెలిసి.. కేసీఆర్ మ‌రింత‌ దూకుడు పెంచారు. ఈటల మీదనే కాకుండా.. ఆయ‌న కొడుకు నితిన్‌రెడ్డి మీద వ‌చ్చిన‌ భూకబ్జా ఆరోప‌ణ‌ల‌పై విచారణకు ఆదేశించారు. ఏ క్షణంలోనైనా ఈటలను, ఆయ‌న కొడుకును అరెస్టు చేస్తారని ప్రచారం చేయించారు. త‌ద్వారా కొత్త పార్టీ పెడితే.. ఉనికే లేకుండా చేస్తామ‌నేలా ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కేసుల ఉక్కిరిబిక్కిరితో అవాక్కైన ఈట‌ల‌.. కొత్త పార్టీతో పోరాడితే.. కొండ‌లాంటి కేసీఆర్‌ను ఢీకొట్ట లేమ‌ని భావించారు. అందుకే, కొత్త పార్టీ ఆలోచ‌న‌ను ఇక్క‌డితో వ‌దిలేశారు.

ఇక.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌నూ న‌మ్ముకోలేని దుస్థితి. హ‌స్తం పార్టీలో ఎవ‌రు ఎవ‌రినీ ప‌ట్టించుకోరు. తాను కాంగ్రెస్‌లో చేరితో గుంపులో గోవింద‌లా.. దిక్కూదివాణం లేకుండా పోతాన‌ని భావించారు. ఇప్ప‌టికే కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు సైతం ఈట‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం వెనుక ఆ పెద్దాయ‌నే ఉన్నార‌ని టాక్‌. అందుకే, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినా ఈటల అటువైపు ఆస‌క్తి చూప‌లేదు. రేవంత్‌రెడ్డికే టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి రాకుండా అడ్డుకుంటున్న పార్టీ అది. అందులోనూ రేవంత్‌పైనా కేసులున్నాయి. ఇక త‌న‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటార‌ని కాంగ్రెస్‌ను జాబితా నుంచి తీసేశారు ఈట‌ల‌. కేసీఆర్‌కూ కావాల్సింది ఇదే. 

ఇక ఈట‌ల ముందు ఉన్న ఏకైక ఆప్ష‌న్‌.. బీజేపీనే. అది ఈట‌ల కోరుకుంది కాదు. కేసీఆరే త్రిశూల వ్యూహంలో భాగంగా ఈట‌ల‌కు వ‌దిలిన ఆప్ష‌న్‌. సొంత పార్టీ, కాంగ్రెస్ అనే రెండు ఆప్ష‌న్స్ లేకుండా కేసీఆర్ ఈట‌ల‌ను క‌ట్ట‌డి చేసి.. అంతిమంగా ఆయ‌న బీజేపీలో చేరక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆరే అంటున్నారు. ఇక్క‌డో డౌట్ రావొచ్చు. ఈటల బీజేపీలో చేరితే కేసీఆర్‌కు ఏం లాభం అనుకోవచ్చ. ఇక్క‌డే ఉంది కేసీఆర్ చాణ‌క్యం. కేసీఆర్ స్కెచ్ సామాన్యుల‌కు అంత ఈజీగా అర్థం కాదు మ‌రి. తెలంగాణలో ఈటల సొంత పార్టీ పెడితే.. బడుగు బలహీనవర్గాల మద్దతుతో.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో.. ఏదో ఒకరోజు సక్సెస్ అయ్యే చాన్స్ త‌ప్ప‌కుండా ఉంటుంది. అందుకే సొంత‌పార్టీ పెట్ట‌నీయ‌కుండా.. కేసుల‌తో అదిరించి.. బెదిరిపోయేలా చేశాడు. ఇక‌, ఈట‌ల కాంగ్రెస్‌లోకి వెళ్లినా కేసీఆర్‌కు క‌ష్ట‌మే. తెలంగాణ గ్రామాల్లో ఇప్ప‌టికీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ప‌టిష్టంగానే ఉంది. ఆ పార్టీకి బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఇటు రేవంత్‌రెడ్డి, అటు ఈట‌ల రాజేంద‌ర్ క‌లిస్తే.. ఫీనిక్స్ ప‌క్షిలా కాంగ్రెస్ మ‌ళ్లీ పుంచుకోవ‌డం ఖాయం. గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే అధికారంలోకి వచ్చే అవకాశమూ లేక‌పోలేదు. అందుకే, ఈటల బీజేపీలోకి వెళ్తేనే కేసీఆర్‌కు లాభం. అదెలా అంటే...

తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డాలంటే ఇంకా చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. ఆ పార్టీకి అర్బ‌న్ పార్టీ అనే ముద్ర ఎలానూ ఉండ‌నే ఉంది. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కాషాయ జెండాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల ఎదురైన వ‌రుస ఓట‌ములు తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌మెంతో చెప్ప‌క‌నే చెప్పాయి. అలాంటి బీజేపీలో ఈట‌ల రాజేంద‌ర్ చేరినా.. పెద్ద‌గా ఇప్ప‌టికిప్పుడు ఆ పార్టీకి క‌లిగే అడ్వాంటేజ్ పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎలానూ బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. ఈట‌ల బీజేపీలో చేరితే.. టీఆర్ఎస్ నుంచే కాకుండా.. కాంగ్రెస్ నుంచీ ఎదురుదాడి త‌ప్ప‌దు. ఈట‌ల చేరిక వ‌ల్ల‌.. బీజేపీ ప‌ర‌ప‌తి కాస్త పెరుగుతుందే కానీ.. ఇప్ప‌టికిప్పుడు పాద‌ర‌సంలా స‌ర్రున పైకి ఎదిగే పార్టీ అయితే కాదు.

ఈట‌ల‌తో బీజేపీ కాస్త బ‌ల‌ప‌డితే.. ఆ మేర‌కు కాంగ్రెస్ ప‌ర‌ప‌తి దిగ‌జార‌డం ఖాయం. అప్పుడు.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, బీజేపీలు రెండు స‌మాన స్థాయి పార్టీలుగా మారుతాయే కానీ.. అవి టీఆర్ఎస్ స్థాయికి ఎదిగే అవ‌కాశం లేద‌నేది కేసీఆర్ ప‌న్నిన త్రిశూల వ్యూహం చ‌తుర‌త‌. ప్ర‌తిప‌క్షంలో ఆధిప‌త్యం కోసం.. ఇటు ఈట‌ల‌, అటు రేవంత్ మ‌ధ్య పోరు సాగుతుంద‌ని.. ఆ రెండు పార్టీల‌కు అంద‌నంత ఎత్తున టీఆర్ఎస్ నిల‌బ‌డి.. సుల‌భంగా మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది కేసీఆర్ చాణ‌క్యం. అలా, గులాబీ బాస్ ఆడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఈట‌ల కేవ‌లం పావు మాత్ర‌మే. ఆటంతా కేసీఆర్‌దే అంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు బీజేపీనే బెస్ట్ ఆప్ష‌న్‌గా మార‌డానికి కార‌ణం కేసీఆర్ ప‌న్నిన త్రిశూల వ్యూహ‌మే కార‌ణ‌మంటూ రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News