తోటి ఉద్యోగులతో మంచిగా ఉంటేనే ఆరోగ్యం

 

ఉద్యోగం అంటేనే బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిచేసేందుకు రకరకాల ఒత్తిళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక ఆ ఒత్తిడికి రాజకీయాలు కూడా తోడైతే చెప్పేదేముంది. నవ్వుతూ చేయాల్సిన ఉద్యోగం కాస్తా నరకానికి మారుపేరుగా మారిపోతుంది. ఉద్యోగం కనుక మనకి తృప్తిని ఇస్తుంటే, తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంటే... మానసికంగానూ, శారీరకంగానూ చాలా లాభం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇవిగో వారి మాటలు-

 

దేశదేశాల నిపుణులు

ఆస్ట్రేలియా, చైనా, జర్మనీ, నార్వే... ఇలా నాలుగు దేశాలకు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఉద్యోగానికీ ఆరోగ్యానికీ మధ్య ఉండే సంబంధాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 15 దేశాల్లోని 19 వేల ఉద్యోగుల మీద నిర్వహించిన 58 పరిశోధనల ఫలితాలను ఒక్కచోటకి చేర్చారు. సైన్యం దగ్గర్నుంచీ సేవారంగం వరకూ అన్ని రంగాలలోని ఉద్యోగుల ఆరోగ్యాన్ని సమీక్షించారు.

 

తోటి ఉద్యోగులే కీలకం

సహ ఉద్యోగులతో సత్సంబంధాలు ఉన్నవారు, తాము చేస్తున్న ఉద్యోగం పట్ల తృప్తిగా ఉన్నవారు ఇతర ఉద్యోగులతో పోలిస్తే మరింత ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. వీరి శారీరిక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉన్నట్లు బయటపడింది. పైగా ఉద్యోగపు బాధ్యతలను నెరవేర్చడంలో నిస్త్రాణంగా (Burn out) మారిపోయే ప్రమాదం కూడా వీరిలో తక్కువగా ఉండటాన్ని గమనించారు.

 

కారణం లేకపోలేదు

ఒక సంస్థలో పనిచేసేటప్పుడు ‘నేను అన్న భావనకంటే ‘మనం’ అనే భావన చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. అప్పుడు సదరు ఉద్యోగి తన సహ ఉద్యోగులతో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. తన వెనుక వారు ఉన్నారన్న భరోసాని కలిగి ఉంటాడు. ఉద్యోగులందరిలోనూ ఇదే భావన ఉంటే, సంస్థలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతిమంగా ఇది వారి సంతోషానికీ, ఒత్తిడి లేని జీవితానికీ దారి తీస్తుంది. నలుగురి అండతో సాగిపోయే ఇలాంటి చోట ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

 

స్త్రీల మీద ప్రభావం శూన్యం

సహ ఉద్యోగులతో అనుబంధంతో మంచి ఆరోగ్యం అనే సూత్రం ఉద్యోగినులకు మాత్రం వర్తించకపోవడం ఆశ్చర్యం. అంటే దాని ఉద్దేశం వారు నిరంతరం రాజకీయాలలో మునిగి తేలుతున్నారని కాదు. ఇప్పటికీ చాలా సంస్థలలో పురుషుల ఆధిక్యతే సాగుతోంది. ఇలాంటి చోట్ల మహిళలు ఎంత చొరవ చూపించినా కూడా, తమకి సంస్థలో సమాన ప్రాధాన్యత లేదన్న భావన కలగడం సహజమే!

 

అనారోగ్యంతో ఉన్నవారు మంచి సంస్థలలో పనిచేస్తే వారి ఆరోగ్యం హఠాత్తుగా మెరుగుపడిపోతుందని కాదు. సంస్థలలో పనిచేయకుండా వ్యక్తిగతంగా పనిచేసేవారికి ఎలాంటి ఆరోగ్యమూ, తృప్తీ లభించవనీ కాదు. కానీ పదిమందితో కలిసి పనిచేస్తున్నవారు, తమ చుట్టూ సానుకూలమైన బంధాలను ఏర్పరుకుంటే మంచిదన్న సూచనను మాత్రం ఈ పరిశోధనలు మనకి అందిస్తున్నాయి.                  

 

 - నిర్జర.