అక్టోబర్‌ 9న ఎమ్మెల్సీ ఎన్నిక. కవిత గెలుపు లాంఛనమే! కేబినెట్ లో చేరబోతుందా?

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక  షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 9న  ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 12న  ఉప ఎన్నిక  ఓట్ల లెక్కింపు జరగనుంది. నిజానికి ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా వైరస్‌ కారణంగా ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.  

ఉమ్మడి జిల్లా పరిధిలో 824 ఓట్లు ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. 

 

నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయణ్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఆప్పటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ వేటు వేశారు. దీంతో ఖాళీగా ఉన్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం ఏప్రిల్‌ 7వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఉపఎన్నిక ప్రక్రియ వాయిదా వేసింది. ఆ సమయం ముగిసినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరోసారి 45 రోజులపాటు ఎన్నికకు గడువును పొడిగించింది కేంద్ర ఎన్నికల సంఘం. 

 

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లుగా మెజార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వారే ఉన్నారు. అయినా కవిత పోటీ చేస్తుండటంతో ఫిరాయింపులను ప్రోత్సహించింది అధికార పార్టీ. నిజామాబాద్ కార్పొరేషన్ కార్పోరేటర్లతో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కారు పార్టీలో చేరారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతోనే కవిత.. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపించారు. 

 

ఇక మొదటి సారి ఎన్నిక వాయిదా పడగానే టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనే వారందరిని ఒకే హోటల్లో పెట్టారు. క్యాంపులో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల జల్సాలు, డ్యాన్సుల వీడియోలు వైరలయ్యాయి. కరోనా సమయంలో భౌతిక దూరం పాటించకుండా అందరిని ఒకే చోట ఉంచడంపై విమర్శలు వచ్చాయి. దీంతో క్యాంపులను ఎత్తివేసింది టీఆర్ఎస్. ఇప్పుడు  పోలింగ్ తేది రావడంతో ప్రతిపక్ష పార్టీలు అప్రత్తమయ్యాయి. తమ ఓటర్లను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి.  

లోకల్ బాడీ ఎమ్మెల్సీ పరిధిలో 824 ఓట్లు ఉండగా.. అందులో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే 532 మంది ఉన్నారని జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత సునాయసంగా గెలుస్తారని తెలిపారు. 

 

నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలిస్తే .. తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్ లో చేరేందుకే కవిత మండలికి పోటీ చేస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కవిత గెలిస్తే... కేంద్ర కేబినెట్ బెర్తు దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆమె లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కాలం ఆమె బయట తిరగలేదు. నిజామాబాద్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాగానే మళ్లీ యాక్టివ్ అయ్యారు కవిత. జిల్లా నేతలందరితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేశారు.