ఆరోగ్యం కావాలా – నీరు తాగి చూడండి

 

 

ఊబకాయం తగ్గాలనీ, రక్తపోటు దరిచేరకూడదనీ, షుగర్ ఒంటికి సోకకూడదనీ ఎవరికి మాత్రం కోరికగా ఉండదు. కాకపోతే నాలుక మన మాట వినదు కదా! ఏది పడితే అది తింటూ తాగుతూ ఉండటమే దాని పని. జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మంచినీరు దివ్యౌషధంలా పని చేస్తుందని భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు.

కొత్తేమీ కాకపోయినా

రోజూ తగినంత నీటిని ఆరారగా తాగుతూ ఉండటం వల్ల బోలెడు ఉపయోగాలున్నాయని నిపుణులు తెగ చెబుతున్న మాటే! ఈ అలవాటు వల్ల చర్మం దగ్గర నుంచీ కిడ్నీల వరకూ ఆరోగ్యంగా ఉంటాయని సూచిస్తున్న విషయమే! కాకపోతే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తేల్చేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేశారు. దీని కోసం 18 వేలకు పైగా యువకులకి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించారు.

ఏం తిన్నారు – ఏం తాగారు

2005 -2012 మధ్య కాలంలో ఈ 18 వేలమందికి సంబంధించిన ఆహారపు అలవాట్లను నమోదు చేశారు. ఈ కాలంలో వారిని పలు దఫాలుగా ప్రశ్నస్తూ, గడచిన 48 గంటలలో వాళ్లు ఏం తిన్నారో, ఏం తాగారో చెప్పమన్నారు. ఆ గణాంకాలని పరిశీలించినప్పుడు... ఆ యువకులు ఒక్క శాతం ఎక్కువ నీటిని తీసుకున్నా కూడా వారి ఆహారపు అలవాట్లలో పెను మార్పులు వచ్చినట్లు తెలుసుకున్నారు.

ఉప్పు, చక్కెర అన్నీ తగ్గాయి

రోజుకంటే ఓ రెండు మూడు కప్పుల మంచినీరు అధికంగా తాగిన యువకులు ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను తక్కువగా తీసుకున్నట్లు తేలింది. వీరు దాదాపు 235 మి.గ్రాముల వరకూ తక్కువ సోడియంనీ, 18 గ్రాముల వరకూ తక్కువ చక్కెరనీ, 21 మి.గ్రాముల వరకూ తక్కువ కొవ్వు పదార్థాలనీ తీసుకున్నట్లు బయటపడింది. ఏతావాతా వీరు దాదాపు 200 కెలోరీల తక్కువ ఆహారాన్ని వీరు తీసుకున్నారట. పైకి చూసేందుకు ఇవన్నీ చిన్న చిన్న లెక్కల్లాగా కనిపించినా... రోజుల తరబడి కనుక ఇదే తీరు కొనసాగితే ఆరోగ్యంలో పెను మార్పులు సాధ్యమే!

ఎందుకిలా!

మంచినీరు తీసుకోవడానికీ ఆహారపు అలవాట్లలో మార్పులు రావడానికీ మధ్య సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నకు పరిశోధకులు స్పష్టమైన కారణాలను చెప్పలేదు. కాకపోతే ఏదో ఒకటి తినే బదులు మంచి నీరు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లుగా తోచి ఆకలి ఉపశమిస్తుందని ఊహిస్తున్నారు. అలాగే దాహాన్ని తీర్చుకునేందుకు చాలామంది శీతల పానీయాలనీ, పండ్ల రసాలనీ తీసుకుంటారు. వీటి వల్ల దాహం తీరడం మాటేమోగానీ అనవసరమైన పదార్థాలన్నీ శరీరంలోకి చేరుకుంటాయి. వీటి బదులు మంచినీరు తాగడంతో ఇటు దాహమూ తీరుతుంది, శరీరంమూ ఆరోగ్యంగా ఉంటుంది. అదీ సంగతి!

- నిర్జర.