ట్రైనీ ఐపీఎస్ మృతిపై అనుమానాలు

 

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం నాడు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఈత కొలనులో పడి తీవ్ర గాయాలపాలు కావడం, ఆ తర్వాత కేర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించిన సంఘటన మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కి చెందిన మను ముక్త్ మానవ్ అర్ధరాత్రి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ గాయాలపాలు అయ్యారని పోలీస్ అకాడమీ అధికారులు చెబుతున్నారు. మను ముక్త్ మానవ్ 2013లో ఐపీఎస్కు ఎంపికై శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో చేరారు. అకాడమీలోని స్విమింగ్‌పుల్‌లో పడి గాయపడడంతో సహచరులు బంజారాహిల్స్‌లోని కేర్‌ అసుప్రతికి తీసుకొస్తుండగా మర్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహన్ని కేర్‌ లోని మార్చురీలో భద్రపరిచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే, ఐపీఏస్‌ అధికారి మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ అకాడమీలో మద్యంతో కూడిన విందు ఇచ్చారని, మద్యం అధికంగా తాగడం వల్ల మను ముక్తి మానవ్ స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పోలీసు అకాడమీ అధికారులు స్పష్టత ఇవ్వాలసిన అవసరం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.