ట్రంప్ ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

 

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆయన వారసుడు ఎవరా..? అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ పదవి కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున యూఎస్ మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ప్రచార పర్వంలో ఇద్దరూ దూసుకెళ్తున్నప్పటికి విజయావకాశాలు ట్రంప్‌కే ఉన్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి దూసుకెళుతున్నాడు. 

 

ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో అందరికి షాక్ ఇచ్చే ఆయన ఈ సారి పెద్ద షాక్ ఇచ్చాడు. అది మాటలతో కాదు...చేతలతో. ట్రంప్ తన ఆస్తుల వివరాలను ఆ దేశ ఎన్నికల సంఘానికి అందజేశారు. దాని ప్రకారం ఆయన ఆస్తి విలువ 10 బిలియన్ డాలర్ల పైనే..అంటే మనదేశ కరెన్సీలో అక్షరాల రూ.66 వేల కోట్ల పై మాటే. ఈ వార్తతో అమెరికన్లతో పాటు ప్రపంచం నివ్వెరపోయింది. ట్రంప్ బిజినెస్ పర్సనాలిటి అని తెలుసు..ఆయన ఆస్తి విలువ మహా అయితే ఏ వెయ్యో..లేదంటే రెండువేల కోట్లో ఉంటుందని ఇప్పటి వరకు అందరూ భావించారు. అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ ట్రంప్ తన ఆస్తుల అసలు నిజాన్ని తెలిపాడు. ఆయన తన ఆస్తుల విలువను ఎన్నికల సంఘానికి అందజేయడం ఇది రెండోసారి. గతేడాది జూలైలో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడు తాజాగా రెండో సారి తన ఆస్తులను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించాడు. అప్పటితో పోలిస్తే..ట్రంప్ ఆస్తుల విలువ దాదాపు 190 మిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి అందజేశానని..ఎన్నికల సంఘం చరిత్రలోనే ఇంత ఆస్తి కలిగిన అభ్యర్థిని తానే కావడం గర్వంగా ఉందని...తన ఆస్తుల్లో చాలా వరకు ప్రపంచ ప్రముఖ కట్టడాలున్నాయన్నారు.