స్టాలిన్ తో కలిసిన పీకే.. తమిళనాట అడుగుపెట్టిన వ్యూహకర్త.. ఇక గెలుపే ఆలస్యం

లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు నెగ్గిన డీఎంకేకు తమిళనాట ఎదురేలేని పరిస్థితి నెలకొంది. రజినీకాంత్ ఎంట్రీతో పాటు ఇతరుల వల్ల తన విజయ యాత్రకు ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలని చూస్తున్నారు స్టాలిన్. అందుకే ప్రస్తుతం దేశంలో సక్సెస్ ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. డీఎంకే తరపున కార్యదర్శి ఆర్ ఎస్ భారతి పీకే టీమ్ తో కలిసి ఒప్పంద పత్రాల పై సంతకం చేశారు. 15 నెలలకు ఈ ఒప్పందం కుదిరింది. 

అన్ని రాజకీయ పార్టీ లతో ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకోరని.. గెలుపు అవకాశాలున్న పార్టీలతో మాత్రమే చేతులు కలుపుతారని ప్రచారం ఉంది. గతంలో నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్, మమత బెనర్జీ, జగన్మోహనరెడ్డి, ఉద్దవ్ ఠాక్రే లకు సలహాలిచ్చి తన వ్యూహాలతో ఆయా పార్టీలు విజయం సాధించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల ప్రసంగంలో సామెతలు, ఊతపదాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. సామెతలను వాడేటప్పుడు పలుమార్లు వాటి అర్ధాలు మార్చేసి వ్యాఖ్యాలు మార్చి పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని రాజకీయ ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలుగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ చేశారు. ప్రస్తుతం పికే టీమ్ వాటికి కౌంటర్ ఇచ్చే పనిలో పడినట్లు సమాచారం. మొత్తం మీద అనేక పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించిన పికే టీమ్ దక్షిణ భారతదేశంలో మరో పార్టీతో పొత్తు కుదుర్చుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.