డివైడ్ అండ్ రూల్ ఇష్టోరీ పార్ట్-2

 

కాంగ్రెస్ పార్టీ (తెరాస కాదు) తెలంగాణా రాష్ట్రం ఇస్తోంది గనుక రానున్న ఎన్నికలలో అక్కడ కొంచెం వీజీగానే విజయం సాధించవచ్చును. అవసరమయితే తెరాసను కలిపేసుకోవచ్చును, ఇంకా మొండికేస్తే వాళ్ళని కూడా విభజించి తెరాసను నామరూపాలు లేకుండా చేయవచ్చును. ఏదారి లేకపోతే చివరికి పొత్తులు కూడా పెట్టుకోవచ్చును.

 

కానీ, సమైక్యాంధ్ర అని ఘర్జిస్తున్న సీమాంధ్రలో ప్రజలని ఎలా పడేయాలి? 25మంది యంపీలు, 150మంది శాసన సభ్యులు ఉన్న సీమాంధ్రలో గెలవాలంటే ఉపాయలేమిటి? బహుశః ఈ రాష్ట్ర విభజన సీరియల్లో, కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగులు చివరికి ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం ముందే సిద్దం చేసుకొందనే విషయం త్వరలోని క్రమక్రమంగా బయటపడుతుంది.

 

ఆ ప్రకారమయితే, కాంగ్రెస్ ముందు మూడు ఆప్షన్స్ సిద్దంగా ఉన్నాయి. వాటిలో ఆ పార్టీకి కావలసింది అది ఎంచుకొంటే, మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చును. లేకుంటే మన్ది ఇంతా చెడ్డా ప్రజాస్వామ్యం గాబట్టి సింపుల్ గా ‘రిజక్ట్ బటన్’ నొక్కేయవచ్చును.

 

ఆప్షన్ 1:ముఖ్యమంత్రి ధిక్కార స్వరం, పదవికి, పార్టీకి రాజీనామా, సీమాంద్రా కాంగ్రెస్ నేతలు కొందరు కొత్త పార్టీ స్థాపన, దానికి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వం, ఆయన నాయకత్వంలో ఎన్నికల వరకు కాంగ్రెస్ అధిష్టానంపై సమైక్యాంధ్ర పోరాటం, సీమాంధ్రలో తెదేపా, వైకాపాలకు చెక్ పెడుతూ ప్రజల ఓట్లను నొల్లుకోవడం, ఆనక షరా మామూలుగా కాంగ్రెస్ పార్టీలోవిలీనం చేసేయడం.

 

ఆప్షన్ 2: ఇది కొంచెం నష్టదాయకమయినది, పైగా రిస్క్ తో కూడుకొన్నది. జగన్మోహన్ రెడ్డికి బెయిలు మంజూరు, వీలయితే వైకాపా విలీనం లేకుంటే షరా మామూలుగా ఆ పార్టీ నేతలని కూడా డివైడ్ అండ్ రూల్ తో లాగేసుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలలో పొత్తులు. ఒకవేళ వ్యవహారం పొత్తుల వరకు వెళితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు.

 

ఆప్షన్ 3: సీమాంధ్రలో మరో రెండు మూడు కొత్త డమ్మీ సమైక్య రాజకీయ పార్టీలను పుట్టించి తెదేపా, వైకాపాల ఓట్లు చీల్చి, ఎన్నికల తరువాత ఆ కొత్త పార్టీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసుకోవడం.