ఆయన శకుని... ఈయన శ్రీకృష్ణుడు...అయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్....

ఇది ఇద్దరు మిత్రుల కథ. . స్నేహానికి విలువిచ్చే రెండు ఉన్నత వ్యక్తిత్వాల ఆవిష్కరణ. ఎన్ఠీఆర్ లోని ఆత్మీయ కోణాన్ని, ఎన్ఠీఆర్ పట్ల  ధూళిపాళ కున్న భ్రాతృ ప్రేమను ఒకే సారి చూసిన ఆయన సన్నిహితుల మాటల్లో.. మీరే చదవండి.. ధూళిపాళ సీతారామ శాస్త్రి. పరిచయం అక్కర్లేని ఈ పేరు గురించి కానీ, ఈయన వ్యక్తిత్వం గురించి కానీ, ఈ రోజు మాత్రమే ప్రస్తావించటానికి ప్రధానమైన కారణం అయితే ఒకటి ఉంది. దివంగత ఎన్ టీ ఆర్ కు ఆత్మీయుడైన ధూళిపాళ తెలుగుదేశం ఆవిర్భావానికి పూర్వం చేసిన కృషి గురించి నందమూరి తారక రాముడి తో సన్నిహిత సంబంధం ఉన్న అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. పార్టీ రాజ్యాంగం రాసే ముందు, ఎన్నో సందర్భాల్లో ఎన్ టీ ఆర్, ధూళిపాళ తో చాలా కీలకమైన అంశాల మీద చర్చించి, ఆయన సలహాలు తీసుకునే వారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పధకానికి తుది రూపు తీసుకొచ్చింది ధూళిపాళే అనే విషయం తామిద్దరి మధ్యనే ఉండాలని ఆయన, ఎన్ టీ ఆర్ దగ్గర మాట తీసుకున్నారు. శిఖర సమాన వ్యక్తిత్వమున్న ధూళిపాళ అంటే అందుకే, ఎన్ టీ ఆర్ కు విపరీతమైన అభిమానం, అలాగే స్నేహానికి ప్రాణమిచ్చి, నటుడిగా తనకు నలుదిక్కులా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటానికి ఎన్ టీ ఆర్ చూపిన విశేషమైన ప్రేమాభిమానాలను ధూళిపాళ తరచూ గుర్తుచేసుకునే వారు. 

వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, ఎన్ టీ ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తొలిసారి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు, అయన అందరికన్నా ముందర వాకబు చేసింది...ధూళిపాళ గారు ఎక్కడ అని.. బిత్తరపోయిన ఎన్ టీ ఆర్ అభిమానులు ధూళిపాళ కోసం ఎయిర్ పోర్ట్ లో వెతుకుతుంటే, ఎన్ టీ ఆరె నేరుగా ఎయిర్పోర్టు విజిటర్స్ గ్యాలరీ లో కూర్చుని ఉన్న ధూళిపాళ వద్దకు వెళ్లి , ఆయనకు పాద నమస్కారం చేసి, హృదయానికి హత్తుకున్నారు. అదీ ఆ ఇద్దరి మిత్రుల కథ. ఎన్ఠీఆర్ పదవీ చ్యుతుడై, తెలుగుదేశం పార్టీ సంక్షోభం లోకి వెళ్లిన సమయం లో -ఆయనకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు ధూళిపాళ. ఆ సమయం లో ఎన్ఠీఆర్ కు, ఆయనకు మధ్య నడిచిన సంభాషణలను దగ్గర నుంచి పరిశీలించిన అత్యంత సన్నిహితులు, ధూళిపాళకు, ఎన్ఠీఆర్ కు ఉన్న బంధం ..ఏకోదరుల బంధంకన్నా ఎక్కువే అని చెప్పుకునే వారు. ఎన్ఠీఆర్ మరణం తో తాను ఏకాకినయ్యానని చెప్పుకున్న ధూళిపాళ తర్వాతి రోజుల్లో సన్యాసాశ్రమం తీసుకుని, పూర్తిగా హనుమంతుడి సేవకు అంకితమైపోయారు. 

ఇహ, ధూళిపాళ సీతారామ శాస్త్రి సినీ రంగ ప్రవేశం ముందు సంగతికి వస్తే, గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు. దివికేగిన ఆ ఇద్దరి మిత్రుల మధుర స్మృతికి తెలుగు వన్ వినమ్రపూర్వక నివాళులు.