ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశం

ధరణి వెబ్ పోర్టల్‌ ను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నవంబర్ 2 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే భూమి యజమానుల వివరాలు కనిపించేలా ధరణి వెబ్‌సైట్‌ ను రూపొందించారు. ఇక మీదట వ్యవసాయ భూములన్నీ ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ ‌తోపాటు మ్యుటేషన్ కూడా జరిగే విధంగా ధరణి వెబ్ సైట్లో మార్పులు చేశారు. భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తరువాత స్లాట్ సమయానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్తే కేవలం 10-15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరిగిపోతుంది. భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే.. ఇకపై భూమిని విక్రయించేవారు, కొనుగోలు చేసేవారు ఇద్దరూ తహసీల్దార్‌ ఎదుట హాజరు కావాల్సిందే. 

 

ధరణి పోర్టల్ ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ.. ధరణి పోర్టల్ దేశానికే మార్గనిర్దేశంగా నిలుస్తుందని చెప్పారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాల‌యాన్ని స‌బ్ రిజిస్ర్టార్ కార్యాల‌యాలుగా మారాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ పోర్టల్ వల్ల అందరి ఆస్తులు, భూములకు రక్షణ ఉంటుందని, అక్రమ రిజిస్ట్రేషన్లకు తావుండదని చెప్పారు. ఈ పోర్టల్ వల్ల క్రయ, విక్రయాలన్నీ నమోదు చేసిన 15 నిమిషాల్లో పూర్తవుతాయని అన్నారు. కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, పైరవీలు చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచలేదని, పాత చార్జీలే అమల్లో ఉంటాయని తెలిపారు. గొప్పగొప్ప సంస్కరణలను తీసుకొచ్చినప్పడు ఇబ్బందులు రావడం సహజమని.. వాటిని ఎదుర్కొని నిలబడ్డప్పుడే అభివృద్ధి సాధించగలుగుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.