నాడు స్వప్నిక... నేడు దిశ... రెండు ఎన్ కౌంటర్లలోనూ సజ్జనారే... డిసెంబర్ లోనే...

 

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో సజ్జనార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దాంతో, దేశవ్యాప్తంగా సజ్జనార్ పేరు మారుమోగిపోతోంది. అయితే, తెలంగాణలో జరిగిన రెండు సెన్సేషనల్ ఎన్ కౌంటర్లూ సజ్జనార్ పోలీస్ బాస్ గా ఉన్న ప్రాంతాల్లోనే జరగడం విశేషం. 2008 డిసెంబర్ 10న వరంగల్ లో విద్యార్ధిని స్వప్నిక... తన స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తుండగా యాసిడ్ అటాక్ జరిగింది. ప్రేమోన్మాది శ్రీనివాస్... అతని స్నేహితులు సంజయ్, హరికృష్ణతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ యాసిడ్ అటాక్ లో తీవ్రంగా గాయపడిన స్వప్నిక చికిత్స పొందుతూ మరణించింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై ఆరోజు తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే, ఆనాడు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.... సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా కాల్చిచంపారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కూడా అలాగే జరిగింది. అయితే, ఆనాడు స్వప్నిక ఎన్ కౌంటర్ జరిగినప్పుడు వరంగల్ ఎస్పీగా ఉన్న సజ్జనార్... ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉండటం కాకతాళీయమే. అంతేకాదు స్వప్నిక నిందితుల ఎన్ కౌంటర్ డిసెంబర్ నెలలోనే జరగ్గా... ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కూడా డిసెంబర్ లోనే జరగడం విశేషం.