కోవిద్ 19 మూలాలు చెరిపేస్తున్న క్యూబా

చిన్నదేశమే అయినా ప్రపంచానికి సాయం..
మూడు దశల్లో జన జీవితాన్ని పునరుద్ధించే ప్రయత్నం..
హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్...

కోవిద్ 19 వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా క్యూబా చేసిన ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. తమ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాల్లో కోవిద్ 19 రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. క్యూబా వైద్యసిబ్బంది సేవలను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ పొందిన ఈ వైద్యసిబ్బంది గతంలోనూ పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ను అరికట్టడంలోనూ విశేష సేవలందించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలన్న ప్రచారం జరుగుతోంది.

కోవిద్ 19ను ఎదుర్కోవడంలో..
కోవిద్ 19ను సమర్థవంతంగా ఎదుర్కొన్న క్యూబాలో ఇప్పటివరకు 2399 కేసులు నమోదు కాగా వారిలో 2,242 మంది పూర్తిగా కోలుకున్నారు. మరికొందరు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య కేవలం 86 మాత్రమే. మరణించిన వారిలో సగం మంది ఆ దేశ రాజధాని  హవానా నగరంలో నివసించేవారే...మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వివిధ దేశాల్లో వైద్యసేవలందిస్తున్న వారిలోనూ కోవిద్ 19 వైరస్ సోకింది. అమెరికా, బ్రెజిల్లో వందలాంది మంది వైద్యసిబ్బంది చనిపోయారు. అయితే క్యూబాకు చెందిన వైద్యసిబ్బందిలో ఏ ఒక్కరిలోనూ కోవిద్ 19 వైరస్ వ్యాప్తించలేదు. ఇందుకు కారణం వారు తీసుకుంటున్న జాగ్రత్తలు. వైద్యసేవలు అందించడంలోనూ ఎంతో కఠిమైన, వైవిధ్యమైన శిక్షణను వారి తీసుకున్నారు.

మూడుదశల ప్రక్రియ ద్వారా...
క్యూబా ద్వీపాల సముదాయం. ఇక్కడి జనాభా కోటి పది లక్షలకు పైగా ఉంటారు. కోవిద్ వైరస్  ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగానే క్యూబాలోనూ వ్యాపించింది. అయితే అక్కడి ప్రభుత్వం చాకచక్యంగా రక్షణ చర్యలు తీసుకున్నారు. దశల వారీగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజలు వ్యాధి బారిన పడకుండా అవగాహన కల్పించారు. ఈ దేశంలోని 15ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ.. ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పన్నులు, విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపు వాయిదా వేశారు. ఒంటరిగా నివసించే వృద్ధులకు సామాజిక కార్యకర్తలు ఆహారాన్ని అందించారు. ప్రజలు వీధుల్లోకి రాకుండా నివారించారు.

ఎలా సోకింది అరా తీస్తూ..
ప్రజారోగ్య అధికారులు వైరస్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించినప్పుడల్లా  వారికి ఎలా సోకింది వివరాలు తెలుసుకుని.. ఆ వ్యక్తితో కంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విధంగా చేయడం వల్ల లక్షణాలు కనిపించని పాజిటివ్ వ్యక్తులను కూడా గుర్తించి వారిని 14 రోజులు ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నవారిని ప్రతిరోజూ డాక్టర్లు పరీక్షించారు. వారిలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం ఉంటే వెంటనే హాస్పిటల్ కు తరలించేలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను సన్నద్దం చేశారు. అయితే ఇంటింటికి పరీక్షలు చేయడం ద్వారా వ్యాప్తిని అరికట్టి ఆసుపత్రి సౌకర్యాలు 60శాతం కన్నా తక్కువే వినియోగించారు. ఈ రోజుకు కూడా ప్రతిరోజూ సుమారు 2 వేల పరీక్షలు జరుగుతున్నాయి.

ప్రజా జీవనం మెరుగుపడేలా..
ప్రారంభంలోనే  దేశ సరిహద్దులను, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేవారి రద్దీని నివారించడానికి బస్సుల్లో, బస్ స్టాప్ ల్లో భౌతిక దూరం పాటించేలా, మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించారు. ట్యాంకర్లు, ట్రక్కులు, పంపుల ద్వారా వీధులను క్లోరిన్‌తో పిచికారీ చేశారు. ప్రతి ఉదయం తొమ్మిది గంటలకు, పబ్లిక్ హెల్త్ బులిటెన్ జాతీయ టీవీలో ప్రసారం చేశారు. కోవిద్ వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు తెలియజేశారు. కచ్ఛితమైన గణాంకాలు చెప్పడం ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి కల్పించారు.

పర్యాటకులను అనుమతిస్తూ..
క్యూబా ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 75శాతం వైద్య సేవలను ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా వస్తోంది. 
మానవ వనరులను ఆర్థిక వనరులుగా మలుచుకోవడంతో విజయవంతమైన దేశం. అక్కడి పర్యాటక ప్రాంతాలు ఆర్థికవనరులు. 
కోవిద్ 19 వైరస్ కారణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం స్తంభించి పోయింది. అయితే క్యూబాలో పర్యాటకులను అనుమతిస్తున్నారు. 
పూర్తి ఆరోగ్య భద్రత చర్యలు తీసుకుంటూ పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం సిద్ధం చేస్తున్నారు.