మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్
posted on May 26, 2025 8:09PM

దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,009 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాస్కులు ధరించాలని జగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.
వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఉదయం 8గంటల వరకు రాష్ట్రాల వారీగా కొవిడ్ యాక్టివ్ కేసుల వివరాలు పరిశీలిస్తే.. కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్ (83), తమిళనాడు (69), కర్ణాటక (47) ఏపీ 4, మధ్యప్రదేశ్ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.