రాజయ్య కోడలది హత్యా..ఆత్మహత్యా?

 

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు నిన్న రాత్రి రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అవడం అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తాజా సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమె గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోనేంత పిరికిది కాదని ఆమె తల్లితండ్రులు అంటున్నారు. ఆమె భర్త అనిల్, అత్తగారు కలిసి ఆమెను, పిల్లలను అడ్డు తొలగించుకొవడానికే ఈవిధంగా హత్య చేసి ఉంటారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

అనిల్-సారికలు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించి 2002సం.లో వివాహం చేసుకొన్నారు. కొంత కాలం వారి కాపురం సవ్యంగానే సాగింది. కానీ అనిల్ కి హైదరాబాద్ లో వేరే స్త్రీతో వివాహేతర సంబంధం ఉందని తెలిసినప్పటి నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుండి అనిల్ వరంగల్ లో తమ ఇంటికి రావడం బాగా తగ్గించేసినట్లు తెలుస్తోంది. భర్త అత్త మామల తీరుతో వేసారిన సారిక గతంలో వారిపై పోలీసులకు పిర్యాదు కూడా చేసారు. ఒకసారి తనుండే మామగారి ఇంటి ముందే పిల్లలతో కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేసారు. ఆ తరువాత పరిస్థితులు కొంచెం సర్దుకొన్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె రాజయ్య ఇంట్లో పై అంతస్తులో తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. ఆమె భర్త అనిల్ మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి పోతుండేవాడు తప్ప ఆమెతో కాపురం చేయలేదు. ఆ కారణంగా తరచూ అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని ఇరుగు పొరుగులు చెపుతున్నారు.

 

నిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉండటంతో పోలీసులు అతనినే అనుమానిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ లీకయి అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. కానీ సారిక ఆమె పిల్లలు వేరే గదిలో నిద్రిస్తున్నప్పుడు గ్యాస్ ఏవిధంగా లీక్ అయింది. లీక్ అయితే ఎటువంటి విస్పోటనం ఎందుకు జరుగలేదు? ఎప్పుడో కానీ రాజయ్య ఇంటికి రాణి అనిల్ నిన్ననే ఎందుకు వచ్చేడు? వంటి అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజయ్యను అతని కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబడుతున్నారు. వారి దర్యాప్తు పూర్తయితే కానీ సారికది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu