ఔను.. వాళ్ళిద్దర్నీ సాగనంపండి...

 

తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఆకర్ష పథకాన్ని ప్రయోగించడంతో రెడ్యానాయక్, యాదయ్య అనే ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను తమ పార్టీ గూటిలోకి లాక్కోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భయపడిపోవడమే కాకుండా అధికార పార్టీ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ జిలానీలు అయిన రెడ్యా నాయక్‌, యాదయ్యల మీద అనర్హత వేటు వేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. మంగళవారం నాడు ఆయన అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ని కలిసి ఈ విజ్ఞప్తి చేశారు. ‘‘మా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని ఫిరాయించారు. మొత్తం నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ కళ్ళముందే టీఆర్ఎస్ బ్లాక్‌లో కూర్చుంటున్నారు. ఈ విషయంలో ఇక వేరే సాక్ష్యాలు అవసరం లేదని భావిస్తున్నాను. అందువల్ల మా పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఫిరాయించిన వారి మీద వేటు వేయాలని కోరుతున్నాను’’ అని జానారెడ్డి ఈ సందర్భంగా అన్నట్టు తెలుస్తోంది.