జగన్ కు డీఎన్ఏ పరీక్ష?

 

 

 

"రావుగారు మీరేం అనుకోనంటే ఒక మాటంటాను. మీకు కొంచెం.. నోటి దూల ఎక్కువే" ఢీ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న డిగ్గీ రాజా.. అదేనండి మన దిగ్విజయ్ సింగ్ గారు కూడా సేమ్ టు సేమ్ రావుగారి టైపే ..అలాగని ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది అనడు. అరిగిపోయిన రికార్డుల్లాగా కొన్నింటిని రిపీట్ చేస్తుంటాడంతే. అందులో మొదటిది అన్ని పార్టీలు అంగీకరించాకే రాష్ట్రాన్ని విభజించాం. రెండోది తెలంగాణా ఇస్తే తెరాస ను కాంగ్రెస్ లో కేసీయార్ విలీనం చేస్తామన్నారు. ముచ్చటైన మూడోది జగన్ ది కాంగ్రెస్ డీఎన్ఏ.

 

మొదటిది నిజమే, రెండోది నిజమే.. మూడోది కూడా దిగ్విజయ్ నిజమేనంటారు. ఎవరికైనా అనుమానం ఉంటే, కాంగ్రెస్ జెండాకు, వైసీపీ జెండాకు డీఎన్ఏ పరీక్ష చేసుకోమంటాడు. మరో వైపు పిల్ల కాంగ్రెస్, ఎన్నికల తరువాత తల్లి కాంగ్రెస్ లో కలిసి పోవడం ఖాయం అంటూ చంద్రబాబు వూరు వాడా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఊతం ఇచ్చేలా డీఎన్ఏ మాట మాననంటున్నాడు దిగ్విజయ్ సింగ్. కొట్టినా, తిట్టినా డిగ్గీరాజా డీఎన్ఏ మాట మీదే నిలబడినప్పుడు మాట తప్పని జగన్ కాంగ్రెస్ పెద్దలకు ఏం మాట ఇచ్చారోనని ప్రజలు గుసుగుసలాడుకుంటున్నారు. మడమ తిప్పని మహానేత తనయుడు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమై విశ్వసనీయత నిలుపుకోవాలని కోరుతున్నారు  వైసీపీ కార్యకర్తలు.