తిరుపతిలో ఫలిస్తున్న కిరణ్ 'ఐ'క్యత మంత్రం ?

తిరుపతి అసెంబ్లీ సమీకరణాలను మార్చే మంత్రం సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కనిపెట్టేశారు. అదేంటో కాదు 'ఐ'క్యత అని వెలుగులోకి వచ్చేలా చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని ఐక్యత ఈ నియోజకవర్గంలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది.ఒకానొకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అని, సైకిల్ యాత్రకు శుభారంభమిచ్చిందని, చివరికి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి వేదిక ఇదేనని ఈ నియోజకవర్గం గురించి పలురకాలుగా చెప్పుకున్నారు. కానీ,ఈసారి మాత్రం సిఎం కిరణ్ పాటించిన పార్టీలో ఐక్యతామంత్రం ఒకరకంగా సమీకరణలను మార్చిందనే చెప్పాలి. సిఎం కిరణ్ తండ్రి అమరనాథ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. అయితే కిరణ్ సిఎం అయినప్పుడే తనకు మంత్రి పదవి రాదని నిర్ధారించుకుని పెద్దిరెడ్డి అధిష్టానానికి కిరణ్ పై ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఈ ఉప ఎన్నికలు ప్రారంభసమయంలోనేసిఎం సమీకరణలు మార్చుకుంటూ వచ్చారు. టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణ విజయానికి సమైక్యతా బాణం వదిలారు. దీంతో ప్రారంభమైన సమీకరణలు చివరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ తిరిగాయి. ఆయన్ని కూడా ఆహ్వానించాలని సిఎం ఆదికేశవుల నాయుడుని కోరారు. పెద్దిరెడ్డి పార్టీ అభ్యర్థి విజయానికి తన వంతు కృషి చేస్తానని ఐక్యతా మంత్రాన్ని బలోపేతం చేశారు. దీంతో అప్పటికే తన కుమారుడు జయదేవ్ కు టిక్కెట్టు రాలేదని దూరంగా వెళ్లిన మంత్రి డికె అరుణను బుజ్జగించే పని ప్రారంభమైంది. చివరికి ఆమె కూడా కొంచెం మెత్తబడి పార్టీ ప్రచారానికి రాకపోయినా పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. సిఎం వెనుక ఉండి తెరపై ఆదికేశవుల నాయుడును అన్ని సమీకరణలకు వాడుకున్నారు. చిట్టచివరిగా సమీకరణాల్లో ఉత్సాహం పాల్గొన్న సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని కూడా కాసేపు పక్కన పెట్టి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తిరపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకరరెడ్డి దగ్గరకు తన ముఖ్యమైన వారిని పంపించారు.

 

 

 

శంకరరెడ్డి 25ఏల్లుగా తెలుగుదేశం క్రియాశీలక నాయకునిగా వ్యవహరిస్తున్నారు. మంచి ప్రజాబలం ఉందన్న నమ్మకంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా టిక్కెట్టు ఇచ్చారు. ఆ తరువాత బాబుతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తెలుగుదేశం నాయకులు బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, ఎంపి శివప్రసాద్ కూడా శంకరరెడ్డితో  చర్చలు జరిపారు. అయితే సిఎం కిరణ్ స్వయంగా ఆహ్వానించటమే కాకుండా ఖచ్చితంగా మంచి మద్దతు కూడగట్టాలని శంకరరెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కూడాశంకరరెడ్డి గురించి ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తే నేను మాట్లాడుతాలే అని ఆయన వారికి భరోసా ఇచ్చారు. చివరికి సిఎం స్వయంగా పిలచినందున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నానని శంకరరెడ్డి ప్రకటించారు. ఇలా చూసుకుంటే మొదట ఆదికేశవుల నాయుడుతో మొదలుపెట్టి చివరికిశంకరరెడ్డి వరకూ కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఐక్యత మాత్రమే. ఈ ఐక్యతే రేపు నియోజకవర్గ  చరిత్ర మారుస్తుందని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నారు. నిజాయితీ పరుడైన తమ పార్టీ అభ్యర్థి చెదలవాడ కృష్ణమూర్తి కూడా గెలుపుగుర్రం ఎక్కేస్తారని తెలుగుదేశం నాయకులు తమ ప్రచార పంథాను లెక్కించుకుని నమ్మకంగా ప్రకటిస్తున్నారు. వీరిద్దరూ కాదు విజయం మాదంటే మాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమాన కరుణాకరరెడ్డి,బిజెపి అభ్యర్థి మధుసూదన్ చెబుతున్నారు. ఏదేమైనా 'ఐ'క్యతా మంత్రం ఎంత వరకూ పని చేస్తుందో ఫలితాల్లోనే తేలాలి. తన మంత్రం ఫలిస్తోందని,రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అనుయాయులు కూడా తమకే మద్దతు ఇస్తున్నారని సిఎం ధీమాగా ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu