తెలంగాణాపై కాంగ్రెస్, బీజేపీల డబుల్ గేమ్స్-2

 

                                         బీజేపీ  వ్యూహం

ఇక, బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడమంటే కాంగ్రెస్ గెలుపుకి తోడ్పడటమే అవుతుంది. గనుకనే, మొదటి నుండి సమన్యాయం రాగం ఆలపిస్తూ తన జాగ్రత్తఃలో తాను ఉంది. ఆ ప్రయత్నంలోనే మొన్న డిల్లీలో తన సీమాంధ్ర నేతలతో ర్యాలీ చేయించి దానికి వెంకయ్యనాయుడిని పంపించి తన మనసులో మాట బయటపెట్టింది. తాము తెలంగాణా ఏర్పాటు కోరుకోతున్నామని చెపుతూనే, సీమాంధ్రకు అన్యాయం జరగకుండా బిల్లులో కొన్ని సవరణలు పెడతామని వెంకయ్యనాయుడు ద్వారా సూచింది.

 

రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ సీమాంధ్ర ప్రాంతానికి అనుకూలంగా చేసే ప్రతిపాదనలను తిరస్కరించలేదు. అలాగని వాటిని ఆమోదించి తెలంగాణా ప్రజలకు ఆగ్రహం కలిగించలేదు. గనుక, ముందుగానే ఈవిధంగా హెచ్చరించి కాంగ్రెస్ పార్టీని వెనక్కి తగ్గేలా చేయగలిగితే దానిపై నెపం వేసి తప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే ఇరుప్రాంత ప్రజలకి పూర్తి ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేస్తామని బీజేపీ అధ్యక్షుడు రాజ నాథ్ సింగ్ తో సహా బీజేపీ అగ్రనేతలందరూ కొత్త పల్లవి అందుకొన్నారు. అచ్చ తెలంగాణావాది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు గతంలో మాదిరిగా తమ పార్టీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తుందని గట్టిగా చెప్పలేకపోవడానికి కారణం కూడా అదే.

 

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలంటే, మరింత బలంగా తెలంగాణా వాదం వినిపించాల్సి ఉంటుంది. అలా జరగాలంటే వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరగకూడదు గనుక బిల్లుకి బీజేపీ బిల్లుకి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును. అదేవిధంగా, సీమాంధ్రలో తెదేపాతో జత కట్టాలని భావిస్తున్న బీజేపీ అక్కడ కూడా లాభాపడాలంటే, కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టినా, పెట్టకపోయినా వెంకయ్య నాయుడు వంటి వారు గట్టిగా సీమాంధ్ర హక్కుల గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ లెక్కలు సరిచూసుకొని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, ముందే చెప్పినట్లుగా బీజేపీ బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా కొన్ని సవరణలు సూచించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టి తను క్షేమంగా బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ ఏ కారణంగానయినా బిల్లుని ప్రవేశపెట్టకపోయినా అంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేసి, తెలంగాణా ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయడం ఖాయం. అందువల్ల, ఈ రెండు ప్రత్యర్ధ పార్టీలు ప్రజలకిచ్చిన మాట కోసం ఒకదానికొకటి సహకరించుకొని వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేస్తాయని నమ్మడం కష్టం.