సీపీఐ - టీ కాంగ్రెస్ పొత్తు ఓకే?

 

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. స్థానాల కేటాయింపుపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. వురోవైపు టీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తుకు దాదాపుగా మార్గాలు మూసుకుపోయాయి. పొత్తు విషయంలో టీఆర్‌ఎస్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా. సోమవారం సీపీఐ నేతలు ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ నేతలతో పొత్తులపై చర్చలు జరిపారు. అయితే టీఆర్ఎస్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన నారాయణ.. తెలంగాణా పీసీసీ చీఫ్ పొన్నాలతో ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారు. తమకు రెండు ఎంపీ, 17 అసెంబ్లీ స్థానాలివ్వాలని కోరారు. ఒక ఎంపీ, 12 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు పొన్నాల అంగీకారం తెలిపారు. అయితే, ఎంపీ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తోందని, సీపీఐ కోరుతున్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండటంతో మరోసారి చర్చించుకుందామని సూచించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని, రెండు సీట్లు ఎక్కువ ఇచ్చేందుకు వెనుకాడొద్దని నారాయణ ఆయనతో చెప్పినట్లు సమాచారం. ఒకటి రెండు అటూ ఇటూగా మొత్తమ్మీద హస్తంలో కంకి కొడవలి ఇమిడిపోయినట్లే భావించవచ్చును.