బొత్సపై అధిష్టానం వేటు

 

సమైక్యరాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బొత్ససత్యనారాయణను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ చాలా ఆశ్చర్యకరంగా ఆయన స్థానంలో రఘువీరారెడ్డిని నియమించింది. బొత్ససత్యనారాయణను పీసీసీ అధ్యక్ష పదవిలో నుండి తప్పించడమే కాకుండా ఆయనను, రఘువీరా రెడ్డి క్రింద పనిచేసే ఒక కమిటీలో ఒక సాధారణ సభ్యుడిగా నియమించడం శిక్షగానే భావించాల్సి ఉంటుంది.

 

బహుశః ప్రజలలో బొత్స పట్ల ఉన్న వ్యతిరేఖతను కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించినట్లు అర్ధమవుతోంది. అయితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భావించినందునే ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించిందని అనుకొన్నా, ఈ ఎన్నికలలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే కనబడనప్పుడు పదవిలో నుండి తప్పించడం కేవలం శిక్షగానే భావించవలసి ఉంటుంది.

 

ఆయన విభజన సమయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను అదుపుచేసి, అందరినీ ఒక్క త్రాటిపైకి తేవడంలో చాలా ఘోరంగా విఫలమయినందునే నేడు కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి దాపురించినదని చెప్పక తప్పదు. సీమాంధ్రలో పార్టీపట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడినప్పుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆ వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నపుడు, దానిని అదుపుచేసి పార్టీని కాపాడే ప్రయత్నం చేయకపోగా, ప్రజలలో తనపట్ల మరింత వ్యతిరేఖత పెరగకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతూ ముఖ్యమంత్రితో కలిసి అధిష్టానానికి లేఖలు వ్రాసారు, ధర్నాలలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఆయన ప్రజలను కానీ, తన అధిష్టానాన్ని గానీ మెప్పించలేక ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిలా తయారయింది.

 

ఎటువంటి రాజకీయానుభవం లేని చిరంజీవికి కూడా ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, సుదీర్గ రాజకీయానుభవం ఉన్న బొత్సకు మాత్రం  ఏ కమిటీ బాధ్యత అప్పగించలేదు. అభ్యర్ధులకు టికెట్స్ కేటాయించే ఈ కీలక సమయంలో ఆయనను పీసీసీ అధ్యక్ష పదవి నుండి తప్పించడం ఆయనకు పెద్ద దెబ్బే కాక ప్రజల దృష్టిలో ఆయన మరింత పలుచనయ్యే అవకాశం ఉంది. అయితే తానే పదవి నుండి స్వయంగా తప్పించమని కోరానని బహుశః ఆయన రేపు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తారేమో!