ఎవరిగోల వారిదే

 

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరి గోల వారిదేలా తయారయిందిప్పుడు. కాంగ్రెస్ అధిష్టానం ఆఖరి నిమిషంలో మళ్ళీ మాట మార్చి రాయల తెలంగాణా ప్రతిపాదన ముందుకు తెస్తుంటే, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంత రావు మాత్రం “ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా ఇస్తున్న సోనియమ్మ మాపాలిట పోచమ్మ ” అంటూ మరో జైత్రయాత్రకు యాదగిరి గుట్టలో జెండా ఊపి సాగనంపి వచ్చారు.

 

రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి ఊడిపోవడంతో ఆమె తన ఖమ్మం జిల్లా నేతలకి కూడా లోకువయిపోయారు. అందుకే ఆమె హడావుడిగా తన అనుచరులను వెంటేసుకొని పది కార్లలో భద్రాచలంపైకి దండ యాత్రకి వెళ్లి, “భద్రాచలం గురించి ఎవరయినా మాట్లాడితే కబడ్దార్!” అని బలప్రదర్శన చేసిన తరువాత, రాముడి గుడికి వెళ్లకపోయినా మీడియా ముందు కాసేపు సోనియమ్మ భజన చేసారు.

 

ఇక మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచవలసి ఉందో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. జైపాల్ రెడ్డి తను తెర వెనుక చేసిన మంత్రాంగంతోనే తెలంగాణా ఏర్పడుతోందని మధ్యమధ్యలో అందరికీ గుర్తు చేస్తుంటారు. ఇక జానారెడ్డిని సైడ్ చేసేసి హటాత్తుగా ముందుకు దూసుకుపోయిన దామోదర రాజనరసింహుల వారు డిల్లీకి మంత్లీ ప్లేన్ పాస్ తీసేసుకొని డిల్లీ-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు. కానీ మొన్నఅధిష్టానం ‘రాయల తెలంగాణా’ అన్నపటి నుండి ఆయన మోహంలో కళ తప్పింది.

 

నిత్యం మీడియా ముందు హడావుడి చేసే జానారెడ్డి, ముఖ్యమంత్రి అవడానికి మద్దతు కూడగట్టుకొనే పనిలో ఉన్నందున ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదని సమాచారం. ఆయన కనబడకపోయేసరికి ఆయన స్థానంలోకి డీ.శ్రీనివాస్ వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ, రాయల తెలంగాణా ప్రతిపాదనను ఖండిస్తూ కొంచెం హడావుడి చేస్తున్నారు.

 

ఎన్నడూ హైదరాబాద్ దాటి తెలంగాణాలో కూడ కాలు పెట్టని దానం నాగేందర్ హైదరాబాద్ ని యూటీ చేస్తే అంగీకరించమని ప్రకటిస్తారు. అదేవిధంగా ‘హైదరాబాదు-యూటీ’ అనే అంశంపై స్పెషలిస్ట్ అయిన చిరంజీవి అదే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారమని సోనియమ్మ చెవిలో చెప్పి వస్తుంటారు.

 

కోట్ల వారికి రాయల తెలంగాణా కావాలి. బొత్సవారు గంట, జేసీ బ్రదర్స్,లగడపాటి తదితరులతో క్రమశిక్షణ చర్యల గురించి వాదోపవాదాలతో తీరిక లేకుండా ఉన్నారు. ముఖ్యమంత్రికి సమైక్యవాదంపై ఉపన్యాసాలు తయారు చేసుకొంటూ ఉండటంతో బొత్తిగా ఖాళీ లేదు.

 

అందువల్ల ఉల్లిపాయలు, టొమేటోల ధరలు పెరిగిపోయాయని, తుఫానులో పొలాలు నష్టపోయాయని, రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, బస్సుల్లోమనుషులు కాలిపోతున్నారని  ఎవరూ ఆందోళన చెందవద్దని మనవి. ఎన్నికలయ్యే వరకు  ప్రజలు కాస్త ఓపిక పట్టాల్సిందే. తప్పదు మరి. అన్యదా భావించవద్దని మనవి.