కాంగ్రెస్, వైకాపాల వ్యూహం

 

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమైక్యసభకి సిద్దం అవుతున్నారు. తద్వారా ఆయన ఉద్యోగులలో చీలికలు కూడా తేగలిగారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మె విరమించుకోగానే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడేమి చేస్తాడు? అని ఆలోచిస్తే కేసీఆర్ ని అతని కుటుంబ సభ్యులని, తెరాస పార్టీని ఈ సందర్భంగా ఒకసారి తలుచుకోక తప్పదు. తెలంగాణాలో కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ మాటలతో అగ్గి రాజేస్తూ ఇంతకాలంగా తెలంగాణా సెంటిమెంటు తగ్గిపోకుండా కాపాడుకొంటూ ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందగలిగారో, అదేవిధంగా ఇక ముందు సీమంద్రాపై పూర్తి ఆధిపత్యం పొందేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల వరకు సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగించవచ్చును.

 

ఒకసారి రాష్ట్ర విభజన జరుపుకోవడానికి మార్గం సుగమమం అయిపోయిన తరువాత, వైకాపా సమైక్య ఉద్యమాలు చేసుకోవడాన్నికాంగ్రెస్ కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. పైగా అతనిని పరోక్షంగా ప్రోత్సహించవచ్చును. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో సీమంద్రాలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఎలాగు వీలుకాదు కనుక అటువంటప్పుడు కేంద్రంలో తమకు మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాను ప్రోత్సహిస్తే, తద్వారా తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చుకూడా.

 

ఈలోగా మరికొన్ని డమ్మీ సమైక్య పార్టీలను సృష్టించగలిగితే, వాటి ద్వారా ఓట్లు చీల్చి ఎన్నికల తరువాత ఆ డమ్మీపార్టీలు సాధించిన సీట్లను బట్టి వీలయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో, అక్కడ కేసీఆర్ తో అధికారం పంచుకోగలదు. బహుశః ఈ వ్యూహంతోనే ఆ రెండు పార్టీలు ముందుకు సాగుతున్నట్లున్నాయి.