బొగ్గు స్కాం- మన జీవితాలకి మసిపూశారు!

 

బొగ్గు ఓ పరిమిత వనరు. కానీ మనిషి అత్యాశ మాత్రం అపరిమితం! ఆ ఆశకి అధికారం కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. చేతులకు మసి అంటుకోకుండా టన్నుల కొద్దీ బొగ్గుని స్వాహా చేయవచ్చు. ఏదో ఒక దశలో విషయం బయటపడితే, తమకే పాపం తెలియదంటూ అమాయకంగా తప్పుకోవచ్చు. అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కలిసి ఆడిన ఈ నాటకంలో నష్టపోయింది మాత్రం సామాన్యుడే! 1.86 లక్ష కోట్లని కేంద్ర ప్రభుత్వం కోల్పోయిందని కంట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నిర్ధరించిన బొగ్గు స్కాం కథే ఇది. బహుశా స్కాం పూర్తయి ఉంటే, ఈ నష్టం పదిలక్షల కోట్లకి పైనే తేలి ఉండేది.

 

భారతదేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నాయన్న విషయం ప్రపంచానికంతటికీ తెలుసు! అయితే ఈ నిల్వలను తవ్వుకునే అవకాశం ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఎలాంటి శాస్త్రీయమైన పద్ధతీ ఉండేది కాదు. 1993 నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ద్వారా ఈ గనులను కేటాయించడం మొదలుపెట్టారు. దీంతో కమిటీ ఇష్టప్రకారం గనులను ఎవరికి పడితే వారికి అప్పగించే అవకాశం చిక్కింది. నామమాత్రపు విలువకే సదరు సంస్థలు అపారమైన ఖనిజాన్ని తవ్వుకునేవి. 90వ దశాబ్దంలో కూడా ఇలాంటి అశాస్త్రీయమైన పద్ధతి ద్వారా గనులను కేటాయించేవారంటే ఆశ్చర్యం కలగక మానదు.

 

2004లో ఈ ఇష్టారాజ్య విధానానికి స్వస్తి చెప్పాలనీ, వేలం వేయడం ద్వారా బొగ్గగనులను అర్హులకు కేటాయించాలనీ నిపుణులు సూచించారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోనేలేదు సరికదా.... విజృంభించి మరీ దేశంలో ఉన్న బొగ్గు గనులన్నింటినీ కేటాయించడం మొదలుపెట్టింది. 1993 నుంచి 2005 వరకు 70 బొగ్గు గనులను కేటాయిస్తే 2006 నుంచి 2009 వరకు... కేవలం నాలుగేళ్ల వ్యవధిలో 145 గనులను కేటాయించి పారేశారు. ఈ సమయంలో బొగ్గు శాఖా మంత్రిగా ఉన్నది సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌!

 

మచ్చలేని చంద్రునిలా కనిపించే మన్మోహన్‌ సింగ్‌కు ఈ విషయంలో ఏ పాపం తెలియదని అందరూ నమ్మారు. మన్మోహన్‌ సింగ్‌ కూడా తనకే పాపం తెలియదనీ, అంతా కమిటీలే నిర్ణయించాయని చేతులు దులిపేసుకున్నారు. అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి.పారేఖ్‌ మీదకి నేరాన్ని తోసేశారు. కానీ పి.సి.పారేఖ్‌ నోరు విప్పడంతో మన్మోహన్ అసమర్థత బయటపడింది. ఎవరికి పడితే వారికి గనులను కేటాయించే విధానం మోసపూరితమైనదని, తాను 2004లోనే మన్మోహన్‌కు లిఖితపూర్వకంగా అందించానని, అయినా తన మాటని ఎవ్వరూ ఖాతరు చేయలేదని పారేఖ్‌ ఆరోపించారు. ఈ స్కాంలో మన్మోహన్‌కు ఆర్థికమైన లాభం ఏదీ దక్కి ఉండకపోవచ్చు. కానీ ఏదో దారుణమైన పొరపాటు జరుగుతోందని మన్మోహన్‌ మనస్సాక్షికి తెలియకుండా ఉండి ఉంటుందా! మన్మోహన్‌ మాత్రమే కాదు. తరువాత కాలంలో బొగ్గుశాఖ మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు కూడా ఈ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ గనులను జిందాల్ స్టీల్‌కు కేటాయించేందుకు, దాసరి కొంత ఆర్ధిక లాభాన్ని కూడా ఆశించారని కూడా సీబీఐ భావించింది.

 

మొత్తానికి బొగ్గు గనులను కేటాయించే సందర్భంలో భారీ కుంభకోణం జరిగిందని తేలిపోయింది. 2012 నుంచి సుప్రీం కోర్టు నేతృత్వంలో సీబీఐ, బొగ్గు కుంభకోణం గురించి దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. దర్యాప్తు గడుస్తున్న కొద్దీ వెల్లడైన వాస్తవాలు సామాన్యులకు దిగ్భ్రాంతిని కలిగించసాగాయి...

 

- బడాబడా కంపెనీలు బినామీల పేరుతో కొన్ని గనులను దక్కించుకున్నాయి.

- ఏమాత్రం అర్హత లేని కంపెనీలు ఇష్టమొచ్చిన సమాచారాన్ని చూపించి, తాము అర్హులుగా నిరూపించుకుని, కొన్ని గనులను దక్కించుకున్నాయి.

- టాటీ స్టీల్‌, జిందాల్‌ స్టీల్ వంటి కంపెనీలు నామమాత్రపు ఖర్చుతో భారీ గనులను దక్కించుకున్నాయి.

- సుభోద్ కాంత్ సహాయ్, జగద్రక్షకన్‌ వంటి కేంద్ర మంత్రులు తమకు చెందిన సంస్థల కోసం గనులను దక్కించుకున్నారు.

 

ఇంత జరిగిన తరువాత కూడా ఎవరికి ఏమేరకు శిక్షలు పడతాయే చెప్పలేం. ఎందుకంటే రాజకీయ నేతలేమో, నేరాన్ని కమిటీ మీదకు తోసేస్తున్నారు. కమిటీలోని అధికారులేమో తమకు అందిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. కాబట్టి చివరికి శిక్షలు పడేది తప్పుడు సమాచారాన్ని అందించిన సంస్థల యజమానులకే కావచ్చు. అన్నింటికీ మించిన ఓ విచిత్రం ఏమిటంటే ఈ గనులను ఏ ప్రాతిపదిక మీదన కట్టబెట్టారు అని తేల్చే 100కి పైగా ఫైళ్లు అదృశ్యం కావడం. అవును! 1993-2003 వరకు గనుల కేటాయింపుకి సంబంధించిన 157 ఫైళ్లు కనిపించుట లేదు! కాబట్టి ఆ సమయంలో జరిగని అక్రమాలకు కారకులను పట్టుకునే అవకాశం చేజారిపోయినట్లే!

 

ప్రస్తుతానికైతే ఇలా విచక్షణారహితంగా కట్టబెట్టిన గనులను పునస్సమీక్షించి, అవసరమైనంత మేర రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మున్ముందు వేలం ద్వారానే గనులను కేటాయించాలనీ నిర్ణయించింది. 2015లో ఇలా కేవలం 11 గనులను కేటాయించినందుకే కేంద్రానికి 80 వేల కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. కానీ ఇప్పటివరకూ జరిగిన నష్టం సంగతో! సామాన్యుడు కుటుంబంతో కలిసి బయట భోజనం చేయాలనుకున్నా రకరకాల పన్నులతో అతణ్ని వేధించే వ్యవస్థలు, లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం ఏదో ఒక స్కాం రూపంలో నేతల చేతుల్లోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడం గమనిస్తుంటే... పిచ్చెత్తి జుత్తు పట్టుకోవడం కంటే సామాన్యడు మరేం చేయగలడు.