పాకిస్తాన్‌ పాలు పోసి పెంచిన తాలిబన్‌

 

27 మార్చి- లాహోర్‌లోని గుల్షన్‌-ఏ-ఇక్బాల్‌ పార్కు.  ఆదివారం, ఆపైన ఈస్టర్‌ పర్వదినం కావడంతో సమయాన్ని సరదాగా గడిపేందుకు వందలాది మంది క్రిస్టియన్లు పార్కులో గుమికూడారు. అకస్మాత్తుగా ఏదో పేలిన శబ్దం. ఏం జరిగిందో మెదడు గ్రహించేలోపే, కళ్ల ముందు మంటలు! పార్కులో అంతెత్తున ఉన్న చెట్లు కూడా భగభగ మండుతూ కనిపించాయి. మనుషుల శరీరాలు గాల్లోకి ఎగిరెగిరి పడ్డాయి. ఈ ఘోరాన్ని చూడలేక 70 మంది కళ్లు మూశారు. జీవితాంతం ఆ దారుణాన్ని గుర్తుంచుకునేలా 300 మంది కొన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక్బాల్‌ అంటే అరబ్బీ భాషలో విజయం అన్న అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ మానవత్వం పరాజయం పాలైంది.

 

సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఏదో ఘనకార్యం చేసినట్లు... తామే ఈ దారుణానికి పాల్పడ్డామంటూ తాలిబన్‌ అనుబంధ సంస్థ  జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ నుంచి ప్రకటన వెలువడింది. నిజానికి ఇది తాలిబన్‌ కనుసన్నలలోనే జరిగిందనడంలో ఎవరికీ ఏ అనుమానాలూ లేవు. ప్రభుత్వాల దృష్టిని మళ్లించేందుకు, కఠినమైన ఆంక్షలను తప్పించుకునేందుకు తీవ్రవాద సంస్థలు.. ఇలా రకరకాల పేర్లతో విషాన్ని కక్కుతూ ఉంటాయి. విషమున్న పాము ఏ పేరుతో కాటు వేస్తేనేం!

 

తీవ్రవాదులు లాహోర్‌ను ఎంచుకోవడం పాకిస్తాన్‌ను సైతం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే పాకిస్తాన్‌లోకెల్లా అతి ప్రశాంతమైన నగరమని లాహోర్‌కు పేరు. స్వాతంత్ర్యం ముందు నుంచీ కూడా మేధావులకూ, ధనికవర్గాలకూ లాహోర్ పెట్టింది పేరు. ఇప్పటి ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ పుట్టింది కూడా లాహోర్‌లోనే! లాహోర్‌ జోలికి రానంతవరకూ, షరీఫ్‌ తీవ్రవాదాన్ని పెద్దగా పట్టించుకోరనే అపప్రథ కూడా ఉంది. అలాంటి చోట విధ్వంసాన్ని సృష్టించడమే కాదు ‘మేం ఈ దాడి ద్వారా నవాజ్‌ షరీఫ్‌కు ఓ సందేశాన్ని పంపిస్తున్నాం. మేం లాహోరులో అడుగుపెట్టాం! ఇక మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మా ఆత్మాహుతి దళాలు మరిన్ని దాడులకు పాల్పడుతూనే ఉంటాయి’ అంటూ జమాన్‌-ఉల్‌-అహ్రార్‌ ఓ హెచ్చరికను సైతం వినిపించింది. దీంతో తీవ్రవాదాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తే, వీలైతే ప్రోత్సహిస్తే... ఎలాంటి ఫలితం దక్కుతుందో షరీఫ్‌కు తెలిసొచ్చింది.

 

90వ దశకంలో వేళ్లూనుకుని, తరువాతి కాలంలో ఆఫ్ఘనాస్తాన్‌నే పాలించే స్థితికి తాలిబన్‌ చేరుకుందంటే అదంతా పాకిస్తాన్ చలవే! 1996-2001 సంవత్సరాల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ సాగించిన పాలన ప్రపంచానికే ఓ పీడకల. షరియా పేరు చెప్పుకుని తాలిబన్ విధించిన శిక్షలకు సమాజం నివ్వెరపోయింది. ఒకవైపు మత రాజ్యాన్ని నెలకొల్పామని చెబుతూనే, స్త్రీల మీద లెక్కలేనన్ని అరాచకాలని సాగించింది. అంతకంటే దారుణం ఏమిటంటే ప్రపంచమంతా ఈ విషయాన్ని చూసీచూడనట్లు ఉండటం. పైగా తాలిబన్ ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు అధికారికంగా గుర్తించడం!

 

తాలిబన్ నేస్తమైన అల్‌ఖైదా కనుక అమెరికా ట్విన్‌టవర్స్ మీద దాడి చేసుండకపోతే అక్కడ వారి పాలన నిరవధికంగా సాగి ఉండేది. అల్‌ఖైదా నేత బిన్‌లాడెన్‌ను తమకి అప్పగించకపోవడంతో, తాలిబన్‌ అమెరికా ఆగ్రహానికి గురి కావల్సి వచ్చింది. అయినా పాకిస్తాన్‌ వెనుకడుగు వేయలేదు. ఒకపక్క ఉగ్రవాదం మీద పోరులో అమెరికాతో కలిసి నడుస్తున్నామని చెబుతూనే, తాలిబన్లకు తమ దేశంలో శరణు కల్పించింది. ఈ విషయమై పాకిస్తాన్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానవు. పాకిస్తాన్‌ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్ మాట్లాడుతూ తాలిబన్‌ తమ కనుసన్నలలోనే ఉన్నారని పేర్కొన్నారు. పైగా తమ దేశంలో వారికి కావల్సిన సదుపాయాలన్నీ అమర్చడం వల్లే వారు తమ చెప్పుచేతల్లో ఉంటున్నారనీ, తద్వారా తాము ప్రపంచశాంతికి దోహదపడుతున్నామనీ సర్తాజ్ పేర్కొన్నారు!

 

కానీ మొన్న జరిగిన దాడిని గమనిస్తే ఎవరి చెప్పుచేతల్లో ఎవరు ఉన్నారో అర్థమైపోతోంది. తాలిబన్‌ మళ్లీ పడగ విప్పుతోంది. పాకిస్తాన్‌ పశ్చిమభాగాన తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంటోంది. అక్కడి పేషావర్‌ లోయలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటోంది. ఇప్పుడు ఏకంగా లాహోర్ మీదే దాడి చేసి తాము దేశం అంతటా విస్తరించామని ప్రకటించింది. పంజాబు (పాకిస్తాన్‌) రాష్ట్రానికి రాజధాని అయిన లాహోర్‌ను చేరుకుంటే, దానికి అనుకుని ఉన్న భారతదేశాన్ని చేరుకోవడం అంత కష్టం కాదు. కాబట్టి ప్రస్తుత పరిణామం మన రక్షణకు కూడా ఆందోళన కలిగించేదే!

 

ప్రస్తుత దాడిని పాకిస్తాన్‌ ఎంత తీవ్రంగా తీసుకుంటుందో చెప్పలేం! ఎందుకంటే ఇది అక్కడి మైనారటీలైన క్రైస్తవుల మీద జరిగిన దాడి. పాకిస్తాన్‌లోని అల్పసంఖ్యాకుల మీద ఇలాంటి దాడులు జరగుతూనే ఉన్నాయి. 2013లో పెషావర్‌లోని ఓ చర్చి మీద జరిగిన దాడిలో కూడా 80 మందికి పైగా మరణించారు. అల్పసంఖ్యాకులను భయభ్రాంతులను చేసేందుకు, వారిని దేశం నుంచి తరిమివేసేందుకు, అక్కడి తీవ్రవాద సంస్థలు ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటాయి.

 

కానీ ఈ దాడికి మరిన్ని కారణాలను కూడా చెబుతున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్‌లో షరియా చట్టాన్ని (మతచట్టం) ఖచ్చితంగా అమలుచేయాలనీ, దైవదూషణ చట్టలను మరింత కఠినతరం చేయాలనీ ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. మరి అటు మతభావనలనీ, ఇటు తీవ్రవాదాన్నీ నవాజ్ షరీఫ్‌ ఎంతవరకూ వేరుచేయగలరో చూడాలి. అన్నింటికీ మించి తీవ్రవాదానికి తరతమ బేధాలు ఉండవనీ, ప్రోత్సహించినవారినే బలితీసుకునే చరిత్ర దానికి ఉందని షరీఫ్‌ గుర్తెరిగితే.... అది ప్రపంచానికే కాదు, పాకిస్తాన్‌ భవిష్యత్తుకు కూడా మంచిది. లేకపోతే ఇలాంటి నరమేధాల గురించి కలచివేసే వార్తలు మరిన్ని వినాల్సి ఉంటుంది!