బెలూచిస్తాన్‌ సమస్య ఏమిటి!

 

బెలూచిస్తాన్‌... ఈ మధ్య తరచుగా వింటున్న ఈ పేరు, పాకిస్తాన్‌లోని ఒక ముఖ్య ప్రాంతం. ఆ దేశంలోని నాలుగు ముఖ్య భాగాలలో బెలూచిస్తాన్‌ ఒకటి. ఆది నుంచి కూడా ఇక్కడ నివసించే ప్రజల నుంచి పాకిస్తాన్‌ పాలకులు వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. తమకు స్వాతంత్ర్యం కావాలంటూ ఇక్కడ నివసించే కొందరు నినదిస్తూనే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే భారతదేశానికి కశ్మీర్‌ ఎలా సమస్యాత్మకంగా మారిందో, పాకిస్తాన్‌కు బెలూచిస్తాన్‌ అలాగ. కానీ ఈ రెండు సమస్యలూ మొదలైన తీరులోనూ, వాటిని ప్రభుత్వాలు ఎదుర్కొనే రీతిలోనూ చాలా బేధం ఉంది.

 

భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే, కశ్మీర్‌ను మనదేశంలో కలిపేందుకు అక్కడి రాజు హరిసింగ్‌ వెనుకాముందూ ఆడాడు. ఆయన తన నిర్ణయాన్ని తీసుకునే వరకు, ఇండియా వేచి చూసింది. కానీ బెలూచిస్తాన్‌ విషయంలో అలా కాదు. స్వాతంత్ర్యానంతరం అక్కడి పాలకుడు అహ్మద్‌ యార్‌ఖాన్‌, పాకిస్తాన్‌కు దక్షిణాన ఉన్న తమ రాజ్యం స్వతంత్ర్యంగానే ఉండిపోవాలని ఆశించాడు. కానీ యార్‌ఖాన్‌ నిర్ణయం కోసం వేచి ఉండటానికి అదేమీ భారతదేశం కాదు. ఏప్రిల్‌ 1948 నాటికి బెలూచిస్తాన్‌లోకి ప్రవేశించిన పాక్‌ సైన్యం, ఆ ప్రాంతాన్ని బలవంతంగా తమ అధీనంలోకి తెచ్చుకుంది. దిక్కుతోచని స్థితిలో యార్‌ఖాన్ తన రాజ్యాన్ని అప్పగించాడు. అయితే బెలూచిస్తాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని కోరాడు. ఆ మాటని పాకిస్తాన్‌ ఎలాగూ పట్టించుకోలేదు.

 

బెలూచిస్తాన్‌లో స్థానికంగా ఉండే తెగలని పాకిస్తాన్‌ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. తమకు తగిన ప్రాతినిధ్యం కావాలంటూ స్థానికులు చేసిన తిరుగుబాటుని ఆ దేశం అణిచివేయడంతో, నిరసన గళాలు మరింత పదునెక్కాయి. ఇక దేశంలోని అన్ని ప్రాంతాల మీదా కేంద్రానికి పూర్తి అధికారాలు ఉంటాయంటూ పాకిస్తాన్‌ 1950ల్లో ‘one unit’ పాలసీని ప్రకటించడంతో తిరుగుబాటు మరింతగా విజృంభించింది. బెలూచిస్తాన్‌లో అధికంగా ఉండే బెలూచి, బెహ్రూయి వంటి తెగలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకటి కావడం మొదలుపెట్టాయి.

 

ఎప్పుడైతే తిరుగుబాట్లు మొదలయ్యాయో, ప్రభుత్వ అలసత్వం కూడా మొదలైంది. బొగ్గు మొదలుకొని బంగారం దాకా ప్రకృతిసిద్ధంగా ఎంతో సారవంతమైనా కూడా బెలూచిస్తాన్‌లో జీవన విధానం దారుణంగా తయారైంది. అక్కడి నిధినిక్షేపాలను పాకిస్తాన్‌ కేంద్రం తవ్విపారేస్తూనే, స్థానికంగా మాత్రం ఏమాత్రం అభివృద్ధి జరగకుండా జాగ్రత్త తీసుకోసాగింది. ఇప్పటికీ బెలూచిస్తాన్‌లో 25 శాతం మంది నిరక్షరాస్యులు. అక్కడి నిరుద్యోగం శాతం 30 శాతం. ఇక అక్కడి జనాభాలో కేవలం 7 శాతం మందికే తాగునీటి సౌకర్యం ఉంది. దాదాపు 50 శాతానికి పైగా పేదరికంలో మగ్గిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అపారంగా ఉన్నా వంటకి గ్యాస్‌ని వాడుకునే అవకాశం అతి స్వల్పం.

 

తమ ప్రాంతంలోని వనరులను తరలించుకుపోతూనే, తమను పేదరికంలో ఎండబెడుతున్న ప్రభుత్వం పట్ల అక్కడి ప్రజల్లో మరింత వ్యతిరేకత మొదలైంది. బెలూచ్ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌, బెలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ... వంటి అతివాద సంస్ధలు ప్రభుత్వంతో పోరుకు సిద్ధపడసాగాయి. ఈ వ్యతిరేకతని పైకి ప్రకటించేవారు కనిపించకుండా పోయేవారు. అక్కడి విషయాల గురించి రాసేవారు కూడా శవాలుగా తేలడం మొదలుపెట్టారు. కశ్మీర్‌లో ‘ఇండియా ముర్దాబాద్’ అంటూ నినాదం చేసి తప్పించుకోవచ్చు. కానీ బెలూచిస్తాన్‌లో పరిస్థితులు వేరు! తిరుగుబాటు దారుల మీద ఏకంగా పాక్ వైమానిక దాడులను చేయడం మొదలుపెట్టింది. పైగా ‘kill and dump’ పేరుతో వందలాది మందిని పట్టుకుని, వారిని చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా చంపి, బహిరంగంగా పడేయడం మొదలుపెట్టింది. ఈ శవాల మీద పాకిస్తాన్ జిందాబాద్‌ వంటి నినాదాలు రాసి ఉండేవి, లేదా పాకిస్తాన్‌ జెండా గుచ్చబడి ఉండేది. స్థానికులను భయభ్రాంతులను చేసేందుకే పాలకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

బెలూచిస్తాన్‌లోని తిరుగుబాటుకు భారతదేశం సాయం చేస్తోందన్నది పాకిస్తాన్‌ ముఖ్య ఆరోపణ. మన దేశ గూఢచర్య వ్యవస్థ (RAW) అక్కడి తరుగుబాటుదారులను రెచ్చగొడుతోందని పాక్ విమర్శిస్తూ వచ్చింది. అయితే ఈ ఆరోపణలను భారతదేశం ఖండిస్తూనే వచ్చింది. కశ్మీర్‌లో పాకిస్తాన్‌ జోక్యాన్ని తక్కువ చేసేందుకే, ఆ దేశం ఇలాంటి ఆరోపణ చేస్తోందని భారతదేశం అంటోంది. అయితే బెలూచిస్తాన్‌లో గత వారం ఒక భారతీయ మాజీ నౌకాదళ ఉద్యోగి పట్టుబడటంతో, పాకిస్తాన్‌ తన ఆరోపణలను తిరగతోడటం మొదలుపెట్టింది.

 

బెలూచిస్తాన్‌లో ఇండియా పాత్ర ఏమోకానీ, చైనా మాత్రం అక్కడి పరిస్థితిని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చేసుకుంది. అక్కడ గ్వదర్‌ అనే ప్రాంతంలో భారీ రేవుని నిర్మించడం ద్వారా చైనా పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చమురు నిక్షేపాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ రేవుని నిర్మించడం ద్వారా అటు వ్యాపారపరంగా చైనాకి లాభం. అక్కడ చైనా ఉనికి ఉండటం వల్ల రక్షణపరంగా పాకిస్తాన్‌కు లాభం. అలా పరాయి దేశానికి సలాం కొట్టి, తన దేశ ప్రజల కడుపు కొట్టిందన్న అపప్రథను పాకిస్తాన్‌ మూటగట్టుకుంది. బెలూచిస్తాన్‌లోని జనం పరిస్థితి ఎప్పటిలాగే దయనీయంగానే ఉంది!