కిరణ్ కు బాసటగా నిలిచిన ప్రణబ్

ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యులుగా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తెలివిగా ఢిల్లీలో పావులు కదిపి కేంద్ర క్యాబినెట్ లో సీనియర్ మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ మద్దతును కూడగట్టుకున్నట్లు తెలిసింది. కిరణ్ కుమార్ కు మద్దతుగా ఎంపి అజారుద్దీన్ మరో రాజ్యసభసభ్యుడు ప్రణబ్ ముఖర్జీని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను వివరించినట్లు తెలిసింది. తెలంగాణా సెంటిమెంట్ లు ఉన్న ప్రాంతాల్లో టిఆరెస్, బిజెపి అభ్యర్థులు గెలిచినప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగిన విషయాన్ని ప్రణబ్ కు వివరించారు.

 

అలాగే కోవూరు నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలుపొందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచారని, నిజానికి అది కాంగ్రెస్ స్థానం కాదని ఇద్దరు ఎంపిలు ప్రణబ్ కు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిని అర్థంచేసుకున్న ప్రణబ్ కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మాట్లాడినట్లు తెలిసింది. ఏవో కొద్ది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినంత మాత్రాన ముఖ్యమంత్రి విఫలమయినట్లు కాదని ప్రణబ్ వ్యాఖ్యానిస్తూ కిరణ్ కుమార్ కు మరింత సమయమిస్తే ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతారని కితాబు ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ చాలా సీనియర్, ఏవైనా అనుకొని పరిణామాలు సంభవించి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేస్తే ఆయన స్థానాన్ని భర్తీచేసే సత్తా ప్రణబ్ కే ఉంది. అటువంటి వ్యక్తినుంచి కిరణ్ కుమార్ కు మద్దతు లభించడం విశేషం.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu