ముఖ్యమంత్రి పర్యటన ముగిసిందలా

 

మూడు రోజుల పర్యటనకని డిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవలం ఒక్క రోజులోనే తన పర్యటన ముగించుకొని, ఈ రోజు రాత్రి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తున్నారు. ఆయన తన ఒక్కరోజు పర్యటనలో అంటోనీ కమిటీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగుని, ఆఖరుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి రాబోతున్నారు. ఆయన విభజనను వద్దని మరోమారు కేంద్రానికి గట్టిగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విభజన ఆగదనే విషయన్నికేంద్రం కూడా అంతే ఖరాఖండిగా ఆయనకు చెప్పినట్లు సమాచారం. అయితే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే వార్తలేవీ ఆయన పర్యటన సందర్భంగా వెలుగులోకి రాకపోవడం విశేషం. ఒకవేళ ఆ వార్తలు గాలి వార్తలయితే, ఆయన త్వరలోనే రాజీనామా చేయవచ్చును.

 

సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్న ఆయనను పదవి లోంచి వెంటనే దిగిపోవాలని పార్టీలో సీనియర్స్ కూడా కోరుతున్న ఈ తరుణంలోఆయన కూడా అట్టే ఎక్కువకాలం పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలోపూర్తి స్థాయి ప్రభుత్వం ఉన్నపటికీ, అదిప్పుడు దాదాపు అచేతనావస్థలో ఉంది. అటువంటి ప్రభుత్వానికి నాయకుడిగా కొనసాగుతూ అప్రతిష్ట మూట గట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. మరి ఈ రోజు ఆయన డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తారా లేక సోనియాగాంధీ తిరిగి వచ్చేవరకు ఆగుతారా? లేక గంటా శ్రీనివాసరావు చెపుతున్నట్లు శాసనసభలో తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టేవరకు ఆగుతారా అనేది త్వరలోనే తేలిపోతుంది. ఆయన రాజీనామా చేసేందుకు కేవలం తగిన సమయం కోసమే ఎదురుచూస్తున్నారు.