ఇంటర్‌ ఫలితాల వివాదంపై కేసీఆర్‌ సమీక్ష

 

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం.. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన తదితర పరిణామాలపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. దీనిలో భాగంగా ప్రగతిభవన్‌లో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫలితాల వెల్లడిలో అసలేం జరిగింది?.. తప్పులు ఎందుకు దొర్లాయి? అనే అంశాలపై కేసీఆర్‌ పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నారు. ప్రధానంగా గ్లోబల్‌ ఎరీనా సంస్థకు ఒప్పందం అప్పగించడంతో పాటు వాల్యుయేషన్ లో తప్పు జరిగిందా? వివరాల నమోదులో జరిగిందా? పొరపాట్లకు గల కారణాలేంటి? అనే అంశాలపై సీఎం ఆరా తీస్తున్నారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ సమవేశంలో కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు సాయంత్రం తమ నివేదికను అందజేయనుంది.