బ్రతకండి..మీ సంస్థను బ్రతికించుకోండి.. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ హితవు

 

తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు.

దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.