గోదావరి నీళ్లతో కాళ్లు కడుగుతామన్న రైతులు.. వద్దన్న కేసీఆర్..
posted on Mar 21, 2016 11:10AM

తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఏదైనా పని చేస్తానని చెబితే అది ఖచ్చితంగా చేసి తీరతారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్నలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలో నీటి సమస్యలకు గాను.. సాగు నీటి పథకాలకుగాను.. సీఎం కేసీఆర్ ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే పలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది రైతులు గోదావరి జలాలను కలశాల్లో తీసుకుని ర్యాలీగా హైదరాబాదుకు వచ్చి.. అక్కడి నుండి నేరుగా సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే వారి రాకను తెలుసుకున్న కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఇంతటి గొప్ప పనిచేసిన మీ కాళ్లను గోదావరి జలాలతో కడుగుతామంటూ రైతులు కేసీఆర్ వద్దకు వచ్చారు. అయితే, కేసీఆర్ వారిని వారించి గోదావరి జలాలున్న కలశాలను అక్కడి బల్లపై పెట్టించారు.