ప్రమాదంలో ప్రకాశం జిల్లా టీడీపీ... భయపడుతోన్న సీనియర్లు

 

గొట్టిపాటి, కరణం వర్గపోరు ప్రకాశం జిల్లాలో టీడీపీ ప్రమాదంలో పడేస్తోంది. ఇద్దరు నేతలు కొట్టుకుంటూ పార్టీ ప్రతిష్టను బజారు కీడుస్తున్నారని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది విపక్షం బలపడటానికి మేలు చేస్తుందన్న భయం పార్టీ నేతల్లో మొదలైంది.

 

గొట్టిపాటి-కరణం మధ్య వర్గపోరు ఈనాటికి కాదు... దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌ వార్‌ నడుస్తోంది. రెండు కుటుంబాలు రాజకీయంగా బలమైనవే. ఇద్దరికీ జిల్లాలో బలమైన అనుచర గణం ఉంది. అందుకే ఒకప్పటి పగలు, ప్రతీకారాలు ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరినీ కలిపి... జిల్లా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇద్దరిలో ఎవరినీ కాదనుకోలేని పరిస్థితి. ఇదే గొట్టిపాటి-కరణం వర్గపోరు ముదరడానికి కారణమవుతోంది.

 

గొట్టిపాటి టీడీపీలో చేరిక సమయంలోనే కరణం తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి బలరాం కుతకుతలాడుతూనే ఉన్నారు. బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నారు. వీరి అనుచరులు ఏకంగా మారణకాండకు పాల్పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తమదే పైచేయని రుజువు చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కరణం-గొట్టిపాటి వర్గపోరుతో అధికారుల బదిలీలు, పించన్ల మంజూరు, ఫ్లెక్సీలు, శిలాఫలకాలు... ఇలా ప్రతి అంశం అత్యంత సున్నితమైనదిగా మారుతోంది.

 

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వర్గ విభేదాలు పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయన్న వాదన జిల్లా పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇద్దరూ ఒక్కటై ప్రత్యర్ధి పార్టీని ఇరుకున పెట్టాల్సింది పోయి... వారికి అస్త్రంగా మారడం పార్టీకి నష్టం చేకూరుస్తుందన్న భావన కనిపిస్తోంది. పదేపదే ఇలా గొడవకి దిగడం వల్ల ప్రజల్లో పార్టీ చులక అవుతుందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి తీవ్రనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతర్గత పోరు ఇలాగే కొనసాగితే పార్టీ మరింత కష్టాల్లో పడటం ఖాయమంటున్నారు.