చంద్రస్వామీ : రాజీవ్ హత్యతో ప్రమేయమున్న ఈ గురూజీ మీకు తెలుసా?

 

న్యూ దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో, మంగళవారం మధ్యాహ్నం, గుండెపోటు కారణంగా చంద్రస్వామి మరణించారు. ఈ వార్త వినగానే ప్రస్తుత తరానికి ఎవరీ చంద్రస్వామి అనే డౌట్ వస్తుంది! కాని, 1990ల నాటి కాంగ్రెస్ రాజకీయాలతో పరిచయం వున్న వారికి ఆయనెవరో బాగానే తెలుసు. 66ఏళ్ల వయస్సులో గుండెపోటుతో పాటూ అనేక అవయవాల వైఫల్యంతో మృతి చెందిన ఆయన అప్పట్లో అత్యంత వివాదాస్పద బాబాజీ! ఏకంగా ఒక ప్రధాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కున్నవాడు! మరో ప్రధానికి అత్యంత ఆప్తుడు! అయితే, ఇద్దరూ సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ కు చెందిన పీఎంలే కావటమే విశేషం!

 

చంద్ర స్వామి గురించి చెప్పుకోవటం మొదలు పెడితే అన్నీ ఆశ్చర్యకర విషయాలే! అయితే, ఆయన గురించి అందరూ మొట్ట మొదట చెప్పే వాఖ్యం… మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి సన్నిహితుడనీ, ఆధ్యాత్మిక గురువని! అదే ఆయనకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది!

 

జ్యోతిష్య శాస్త్రంలో ఉద్ధండ పండితుడని పేరున్న స్వామీజీ కేవలం పీవీకి మాత్రమే దగ్గరివాడు కాదు. ఆయన దిల్లీలో కట్టుకున్న ప్రఖ్యాత ఆశ్రమానికి భూమిని కేటాయించింది ఇందిరా గాంధీ అంటారు! అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఆయన సలహాలు తీసుకున్న వీవీఐపీలు బోలెడు మంది వున్నారు. బ్రూనై సుల్తాన్, బెహ్రైన్ సుల్తాన్,  హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, బ్రిటన్ ప్రధాని మార్గరేట్ థాచర్, ఆయుధాల వ్యాపారి ఆద్నాన్, మాఫియా డాన్ దావూద్… వీళ్లంతా ఆయన శిష్యులే! రాజకీయ నాయకులు మొదలు సినిమా వారి వరకూ, వ్యాపారులు మొదలు నేరగాళ్ల వరకూ అందరూ చంద్రస్వామి మహిమకు జోహార్లు కొట్టిన వారే!

 

అంతర్జాతీయంగా పేరు మోసిన వారెందరికో మార్గ నిర్దేశనం చేసిన చంద్రస్వామి అదే రేంజ్ లో న్యాయపరమైన చిక్కుల్లో కూడా ఇరుక్కున్నారు. ఆయన మీద 1996లో ఆర్దిక సంబంధమైన ఆరోపణలు మోపబడ్డాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానానికి ఈడ్చింది. చివరకు చంద్ర స్వామి 9కోట్లు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. ఇంకా కొన్ని ఆరోపణలపైన ఆయన మీద ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. అయితే, అన్నిటికంటే విభ్రాంతికరమైన అంశం… రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆయన ప్రమేయం వుందని జైన్ రిపోర్ట్ వెల్లడించింది. ఇది కోర్టుల్లో నిరూపించబడలేదు కాని చాలా మంది చంద్రస్వామి ప్రమేయం రాజీవ్ హత్యలో వుందని గట్టిగా నమ్ముతూ వుంటారు!

 

కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలో దేశ రాజకీయాల్లో సంచలనం అయిన చంద్రస్వామి అంతే వేగంగా కనుమరుగు కూడా అయ్యారు. గత కొన్ని ఏళ్లుగా ఆయన గురించి ఎక్కడా చిన్న న్యూస్ కూడా కనిపించకపోవటమే ఇందుకు నిదర్శనం! అయితే, ఆయన మరణంతో ఒక మిస్టరీకి మాత్రం తెరపడినట్టైంది!