గోదావరి నదిలో 8 మంది యువకులు గల్లంతు..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

 

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాకినాడ జిల్లా రామచంద్రపురం మండపేటకు చెందిన యువకులు శురుల్లంక  గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి పలువురు యువకులు హాజరయ్యారు. వీరిలో 11 మంది సరదాగా స్నానం చేసేందుకు సమీపంలోని కమినిలంక వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే, వారు దిగిన ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురు అతి కష్టం మీద సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు.గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్‌, సాయి, సతీష్‌, మహేశ్‌, రాజేశ్‌, రోహిత్‌, మహేశ్‌గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

గోదావరి నదిలో యువకులు గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలింపు చర్యల వివరాలను చంద్రబాబుకు కలెక్టర్‌ వివరించారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కూడా కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu