ఈ 150 గోల ఏంటయ్యా చిరూ!



మాజీ మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కరించి రాయునది. మీరు గతంలో మెగాస్టార్‌గా వుండేవారు. ఒప్పుకుంటాం.  ఆ మెగాస్టార్ ఇమేజ్ చూసుకునే మీరు రాజకీయాల్లోకి వెళ్ళారు. ఇక్కడ సూపర్ హిట్టయిన మీరు అక్కడ అట్టర్ ఫ్లాపయ్యారు. రాజకీయాల్లో ఇక మీ టాలెంట్ ఎందుకూ పనికిరాదని అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దృష్టి సినిమా ఇండస్ట్రీ మీద పడింది. ఆ లెక్కలూ ఈ లెక్కలూ వేసి మీరు  ఇప్పటి వరకూ 149 సినిమాలు చేశారని, ఇప్పుడు 150వ సినిమా చేయాలని అనుకుంటున్నానని ప్రకటించారు. కథ కోసం, దర్శకుడి కోసం వెతుకుతున్నామని చెప్పుకొచ్చారు. మీరు 150వ సినిమా చేస్తున్నారని తెలుసుకుని మీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓకే... మీరు తీస్తే 150వ సినిమా తీసుకోండి.. ఇంకా వీలుంటే 1500వ సినిమా కూడా తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు. కానీ 150వ సినిమా పేరు చెప్పి మీరు చేస్తున్న హడావిడి మాత్రం పద్ధతిగా లేదు.

ఏ దుర్ముహూర్తాన మీరు 150వ సినిమాలో నటిస్తున్నానని ప్రకటించారో అప్పటి నుంచి నానా గందరగోళం. అంతకుముందు వేరే గందరగోళం వుండేది... చిరంజీవి 150వ సినిమాలో నటిస్తాడా.. నటించడా.. నటిస్తే ఆ సినిమా ఎలా వుంటుంది.. ఇలా వుంటుందా అలా వుంటుందా. ఆయన నటిస్తానంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పుకుంటుందా.... ఇలాంటి ఎన్నో అంచనాలు మీరు, మీ ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మీరు 150వ సినిమాలో నటించబోతున్నానని ప్రకటించారు. ఇటు స్టేట్‌లో, అటు సెంటర్లో మీ పార్టీ మటాషైపోయింది కాబట్టి మీక్కూడా తీరిక దొరికింది. దాంతో 150 సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. అంతవరకూ ఓకే... కానీ అప్పటి నుంచి మీ 150వ సినిమా పేరుతో జరిగిన తిరణాల చూడటానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులు చాలడం లేదు. ఈ సినిమాకి కథ ఎవరిస్తారు? దర్శకుడెవరు? ఫలానా దర్శకుడా? చిరంజీవే డైరెక్ట్ చేస్తాడా? హీరోయిన్ ఎవరు? తమన్నా నటిస్తుందా? శ్రీదేవి నటిస్తుందా?... ఎన్నో ఊహాగానాలు, ఎన్నో లీకులు... గోలగోల.

ఇలాంటి ఊహాగానాలు, లీకుల వెనుక మీరు లేరని మేము భావించం. ఎందుకంటే, ఈ తరహా వ్యూహాలను మీరు గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయోగించారు. చిరంజీవి పార్టీ పెడతాడా, పెట్టడా అనే ప్రచారాన్ని మీరు ఎంత పకడ్బందీగా నిర్వహించారో మాకు తెలియనిది కాదు. అదే వ్యూహాన్ని ఇప్పుడు మీరు మీ 150వ సినిమా విషయంలో కూడా ఫాలో అవుతున్నారని జనం నమ్ముతున్నారు. మీరు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మీ ‘మెగాస్టార్’ పోస్టు ఊడిపోయింది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి వస్తే జనం చూస్తారా లేదా అనే భయం మీలో వుంది. అందుకే జనాన్ని ప్రిపేర్ చేయడం కోసం, మీకు క్రేజ్ పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రచారం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారని జనం విశ్వసిస్తున్నారు. 150వ సినిమాలో నటిస్తే నటించేయండి... మధ్యలో ఇదంతా అవసరమంటారా?


మీరు ఇప్పటికే 149 సినిమాల్లో నటించారు. త్వరలో 150వ సినిమాలో కూడా నటిస్తారు. ఇందులో వెరైటీ ఏముంది? సినిమా రంగంలో ఎవరూ సాధించని ఘనతేమీ కాదు కదా...! ఓహో.. తమరు రాజకీయాల్లోకి వెళ్ళి తిరిగొచ్చేసిన తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి మీరు, మీ అభిమానులు దాన్ని వెరైటీగా భావిస్తూ వుండొచ్చు. తీసే సినిమాలో వెరైటీ వుండాలిగానీ, అంకెలో ఏముంది? మీరు నటిస్తున్న 150వ సినిమా అయితే ప్రేక్షకులకు ఏంటంట? బాగుంటే హిట్ చేస్తారు.. బాగాలేకపోతే ఫట్ చేస్తారు. మీరు గతంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఆ సినిమాలో వున్న మేటర్నిబట్టి ఇచ్చారే తప్ప  ఆ సినిమా తాలూకు నంబర్ని చూసి కాదు కదా... అలాంటప్పుడు మీ 150వ సినిమా విషయంలో ఎందుకు అంత హడావిడి చేయడం. మీరు నటిస్తున్న సినిమా 150వ సినిమా కాబట్టి దాన్ని తప్పకుండా హిట్ చేయాలన్న ఉద్దేశం ప్రేక్షకులకు ఎంతమాత్రం వుండదని మీకు తెలుసని అనుకుంటున్నాం. అలాగే ఇది మీ 150వ సినిమా కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మీరు ఈ సినిమాకి మాత్రమే కాదు.. మీరు గతంలో నటించిన అన్ని సినిమాలకీ ఇన్నే జాగ్రత్తలు తీసుకున్నారు. మరి వాటిలో కొన్ని హిట్టయ్యాయి. కొన్ని ఫట్టయ్యాయి. దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హిట్టు, ఫట్టు అనేది మనచేతుల్లో వుండదు. అలాంటప్పుడు ఈ హడావిడి అంతా ఎందుకంటారు?