చిరు పార్టీ కార్యాలయం క్లోజ్డ్
posted on Mar 15, 2012 12:51PM
హైద
రాబాద్: కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కార్యాయాన్ని అసెంబ్లీలో మూసి వేశారు. 2009 సాధారణ ఎన్నికలలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుండి ఆయనతో సహా పద్దెనిమిది మంది శాసనసభ్యులుగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో వారికి శాసనసభలో గదిని కేటాయించారు. అయితే ఆ తర్వాత సంవత్సరం క్రితం తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు.
విలీనంపై ఈసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో ప్రజారాజ్యాన్ని ప్రత్యేకంగా చూడటంపై విపక్షాలు పలుమార్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ప్రశ్నించాయి. ఆ తర్వాత శోభా నాగి రెడ్డి రాజీనామా ఆమోదించడం, చిరంజీవికి రాజ్యసభ సీటు ఖాయమైందన్న వార్తల నేపథ్యంలో ఇటీవల ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయి విలీనం తీర్మానం చేశాయి. దానిని కాంగ్రెసుకు పంపించాయి. అక్కడ కూడా ఆమోదం పొందిన తీర్మానం ఇటీవల స్పీకర్ దగ్గరకు వచ్చింది. దీంతో స్పీకర్ నాలుగు రోజుల క్రితం కాంగ్రెసులో పిఆర్పీ విలీనాన్ని అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీలో కూడా పిఆర్పీ విలీనం అధికారం కావడంతో చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని మూసివేశారు.