ష్‌... పిల్లవాడిని చదువుకోనీయండి!

 

పిల్లలు చక్కగా చదువుకునేందుకు ముఖ్యంగా కావల్సింది ఏమిటి అంటే... ప్రశాంతమైన వాతావరణం అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. కానీ చాలామంది ఆ ప్రశాంతతను కల్పించేందుకు పెద్దగా శ్రద్ధ చూపరు. ఇంట్లో ఒక పక్క పిల్లవాడు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉన్నా... టీవీ హెచ్చు స్థాయిలో పెట్టుకోవడమో, ఫోన్లో నిరంతరం గట్టిగట్టిగా మాట్లాడటమో చేస్తుంటారు. అదేమంటే ‘పిల్లవాడిలో ఏకాగ్రత ఉండాలే కానీ ఎలాంటి శబ్దంలో అయినా చదువుకుంటాడు కదా!’ అని దబాయించేస్తూ ఉంటారు. ఇక మీదట అలా దబాయించే అవకాశం లేని కొన్ని పరిశోధనలు బయటపడ్డాయి.

 

అమెరికాకు చెందిన విస్కాన్‌సిన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు ఈ పరిశోధను నిర్వహించారు. ఇందులో భాగంగా వారు 22-30 నెలల మధ్య వయసున్న 106 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. ఆ తరువాత వారికి రణగొణ ధ్వనులు వినిపించే వాతావరణంలో ఒక రెండు కొత్త పదాలు ఉన్న వాక్యాలను చెప్పి, వాటి అర్థాలను వివరించారు. తరువాత పిల్లలను కొత్త పదాల గురించి అడిగితే ఏముంది! వారిలో చాలామందికి ఆ పదాల గురించిన గుర్తే లేకుండా పోయింది. దీనికి విరుద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో వారికి కొత్త పదాలను అలవాటు చేసినప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేకుండా వారు పదాలను తిరిగి గుర్తుచేసుకోగలిగారు. కొత్తగా ఒక శబ్దాన్ని వినడానికీ... ఆ శబ్దానికీ, దాని అర్థానికీ మధ్య పొంతనను ఏర్పరుచుకోవడానికీ ప్రశాంతమైన వాతావరణం దోహదపడుతోందని తేలింది.

 

నిజానికి ఇలాంటి పరిశోధనలు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా పిల్లల మీద వారి చుట్టూ వినిపించే రణగొణధ్వనుల ప్రభావం ఎలా ఉంటుందంటూ కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో చాలా దిగ్భ్రాంతికరమైన విషయాలే బయటపడ్డాయి. చుట్టుపక్కల నిరంతరం వినిపించే శబ్దాలు పిల్లవాడి గ్రహణశక్తిని దెబ్బతీస్తాయని వీటిలో తేలింది. ఇలాంటి పిల్లలు మానసిక సమస్యలకు కూడా లోనయ్యే ప్రమాదం ఉందని బయటపడింది. అంతేకాదు! ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లల్లో గుండె వేగం పెరిగిపోవడం, రక్తంలో ప్రమాదకరమైన కార్టిజాల్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి కావడం జరిగాయి. అంతిమంగా ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు బడిలో వెనుకబడతారన్నది రూఢి అయ్యింది.

 

ఏతావాతా! ఎదిగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా వారు చదువుకుంటున్నప్పుడు... ప్రశాంతకరమైన వాతావరణాన్ని కల్పించడం పెద్దల బాధ్యత అని ఈ పరిశోధనతో తేలుతోంది. బయట నుంచి వచ్చే శబ్దాలను మనం ఏమీ చేయలేకపోవచ్చు. ముఖ్యంగా అర్థికమైన సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఇంట్లో అయినా సర్దుబాటు చేసుకోక తప్పని స్థితి ఉంటుంది. కానీ ఇంట్లో శబ్దాలను నియంత్రించడం పెద్ద కష్టం కాదు కదా! పిల్లవాడి భవిష్యత్తు కోసం కాస్త టీవీ శబ్దాలను, అరుపులను తగ్గించడంలో తప్పేముంది!

 

- నిర్జర.