కౌన్ బనేగా కర్ణాటక సీఎం..?

కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వరుస వివాదాలతో రేపో, మాపో వేటుకు సిద్ధంగా ఉన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య. ఇటువంటి పరిస్థితుల్లో హాట్ కేకులాంటి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సీఎం పీఠం దక్కించుకోగల అవకాశం ఉన్న నేతలుగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ఎం కృష్ణ ముందువరుసలో ఉన్నారు. తనకున్న పలుకుబడిని ఉపయోగించి మరోసారి సీఎంగా పగ్గాలు చేపట్టాలని తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన గతవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అంతేకాకుండా తనకు అవకాశమిస్తే పార్టీకి వైభవాన్ని తీసుకువస్తానని..వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలో కూర్చోబెడతానని హామీ ఇచ్చారు.

 

మరో నేత ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కూడా సీఎం రేసులో ఉన్నానని చెప్తున్నారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించిన పరమేశ్వర తానే సీఎం అని కలలు కన్నారు. అయితే హైకమాండ్ ఆయన కలలను కల్లలు చేస్తూ సిద్ధూని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఇప్పుడు సిద్ధూపై వేటు పడటంతో పాటు దళిత నేత కావడం..రాష్ట్రంలో దళితులు చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉండటంతో పరమేశ్వరను సీఎం చేయడం వల్ల మరింత ప్రయోజనం లభించి దళితుల మద్ధతు కూడగట్టవచ్చని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.

 

వీరందరి కంటే ముందు కర్ణాటక సీఎం అభ్యర్థిగా స్క్రీన్‌ మీదకు వచ్చిన వ్యక్తి మల్లిఖార్జున ఖర్గే.  సీనియర్ రాజకీయవేత్త కావడంతో పాటు సోనియ చెప్పినట్లు వినే నేత అయిన ఖర్గే దాదాపుగా కన్ఫాప్ అయినట్లే అని అందరూ భావించారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో పార్టీకి నాయకత్వం వహించే కీలకమైన స్థానంలో ఉండటం..ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ వాణిని వినిపిస్తున్నారు ఖర్గే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పోటీలో ఉండకపోవచ్చని పార్టీ వర్గాల అభిప్రాయం. సుదీర్ఘకాలం తర్వాత కన్నడ రాజకీయాలను కాంగ్రెస్ శాసించడానికి, హస్తం విజయం సాధించడానికి సిద్ధూ కష్టం, వ్యూహాలే ప్రధాన కారణం. మరి అంతటి కష్టజీవిపై వేటు వేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం సాహసించదని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా రానున్న నెల రోజులు సిద్ధరామయ్యకు గడ్డు కాలమే.