దేవదేవుని సన్నిధిలో 'బాబు గర్జన'

 

 

 

దేవదేవుని సన్నిధిలో ప్రజా గర్జన ప్రారంభమైందని, తెలుగుదేశం ఈ మహయజ్ఞాన్ని ప్రారంభించిందని, అందరూ భాగస్వాములు కావాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఆదివారం జరిగిన ప్రజా గర్జన సభలో పిలుపునిచ్చారు. సుదీర్ఘ సమయం ప్రసంగించిన చంద్రబాబు ఆద్యంతం పూర్తి ఉద్రేకంగా మాట్లాడారు. బాబు ప్రసంగం ఇప్పటిదాకా ఆయన చేసిన వాటికి భిన్నంగా సాగింది. జనాన్ని తరచూ ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ నేరుగా వారితోనే మాట్లాడిన అనుభూతిని కల్పించారు. ఆయన ఉపన్యాస ధోరణి గతానికి పూర్తి భిన్నంగా ఉండి జనాన్ని బాగా ఆకట్టుకుంది.

 

మరోవైపు వేదికపైకి వచ్చినప్పటి నుంచీ బాబు ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించారు. తరచూ చిరునవ్వులు చిందిస్తూ జనానికి విజయసంకేతం చూపిస్తూ అభివాదం చేశారు. ఆయన పలకరింపులకు ప్రతిగా జనం రెచ్చిపోయి కేరింతలు కొట్టారు.



టీడీపీ విజన్ 2020 తయారు చేస్తే కాంగ్రెస్ దొంగలు విజన్ 420 తయారు చేశారంటూ 2004 నుంచి కాంగ్రెస్ పాలనను, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను దృష్టిలో ఉంచుకుని విమర్శన్ద్మాలు సంధించారు. సోనియా గాంధీకి ప్రజలు దయతో ఓటు వేస్తే అనకొండ పాము కంటే భయంకరంగా దేశమంతా వేలాది అనకొండలను తయారు చేసిందని, వాటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటైతే సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఇంకొకటని దెప్పి పొడిచారు. పిల్ల అనకొండ జగన్ అంటూ వర్ణించారు. ఈ అనకొండలు దేశాన్ని మింగేస్తున్నాయని, జగన్ వందలాది కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు.



ఒకవైపు కాంగ్రెస్, వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూనే ఇంకోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయదలచారో వాగ్దానాలు, హామీల రూపంలో చెప్పారు. తమను గద్దెనెక్కిస్తే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామంటూ సామాన్యులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తామని, ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని హామీల వర్షం కురిపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత తనదే అని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. బీసీ డిక్లరేషన్ తమ పార్టీయే ఇచ్చిందని, పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్షహ్యొం అని స్పష్టం చేశారు.



రాష్ట్ర విభజన విషయంలో అంటీముట్టనట్టుగా మాట్లాడే చంద్రబాబు తిరుపతి సభలో విభజన సమస్యల గురించి చాలాసేపే మాట్లాడారు. రాష్ట్రం విడిపోవాలంటే సీమాంధ్రకు న్యాయం జరగాలని, సమైక్యంగా ఉండాలంటే తెలంగాణకు న్యాయం చేయాలని, వీటిలో ఏది జరగాలన్నా రెండు ప్రాంతాల వారినీ ఒక చోటికి చేర్చి ఒప్పించాలని అనడం జనానికి నిజమే కదా అనిపించేలా చేసింది. చివరన చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామంటూ ప్రతిజ్ఞ చేయించినపుడు కూడా జనం ఉత్సాహంగా లేచి నిలుచుని ప్రతిజ్ఞ చేశారు.