బాబు మైండ్‌గేమ్‌కి మోడీ దిగివస్తారా..?

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటేరియన్లంతా మూకుమ్మడిగా పార్లమెంటు ముందు నిరసనకు దిగారు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఇందులో భాగస్వాములు అయ్యారు. వీరందరిలో తెలుగు దేశానికి చెందిన సభ్యులపై ఒత్తిడి తారాస్ధాయిలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారని ఇప్పటికే టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బయటకు వద్దాం అని ప్రయత్నిస్తే.. అటువైపు నుంచి రాయబారాలు రావడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అవకాశం ఇచ్చి చూద్దాం అని శ్రేణులకు సర్ది చెప్పారు.

 

కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా తెలియజేయాలని ఎంపీలకు తెలియజేశారు. అధినేత ఆదేశాలతో కదిలిన టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఇప్పుడు ఏపీకి ఏమైనా లాభం జరిగితే అది తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోతుందని గ్రహించిన.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా తన ఎంపీలను రంగంలోకి దించింది.

 

వీరిద్దరూ పోటాపోటీగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి.. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అరుపులు.. గోలలు.. గందరగోళం మధ్య సభను నడపలేక స్పీకర్ సభను వాయిదా వేశారు. ఈ రచ్చ జరుగుతుండగానే.. కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ప్రధాని వద్దకు పంపించారు చంద్రబాబు. సభ వాయిదా పడిన అనంతరం మోడీని కలిసిన సుజనా సుమారు అరగంట పాటు భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏపీకి ఎలాంటి అన్యాయం జరగదని.. తొందరపడవద్దని ప్రధాని స్పష్టమైన హామీ ఇచ్చారట. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.. ఆందోళనలతో ఏం సాధించలేమని ప్రధాని చెప్పినట్లు టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవైపు నిరసనలతో ఒత్తిడి పెంచుతూనే.. మరోవైపు చర్చల ద్వారా చంద్రబాబు కేంద్రాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా ఒకటి అనుకుంటే ఆరునూరైనా దాని నుంచి డైవర్ట్ అవ్వని మోడీ.. చంద్రబాబు మైండ్‌గేమ్‌కే ఏ రకంగా చెక్ పెడతారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.