"నందులు" బాబు కొంపముంచుతాయా..?

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ముహూర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ ఆ నెక్ట్స్ మినిట్ నుంచి రాష్ట్రప్రభుత్వం మీద విమర్శల వాన కురుస్తోంది. అవార్డులు ప్రకటించిన తర్వాతి క్షణం నుంచి ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమకు కావల్సిన వారికి.. అయిన వారికి పురస్కారాల్లో పెద్దపీట వేశారని ఒకవైపు.. ఒకే సామాజిక వర్గానికి గుంపగుత్తగా అవార్డులను కట్టబెట్టారని  ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక అభిమానులైతే ప్రభుత్వం మీద పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. అవార్డుల ఎంపికలో మెగా కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారిని.. వారు నటించిన సినిమాలను ఏ మాత్రం పట్టించుకోలేదని.. ఏదో కంటితుడుపుగా మెగాస్టార్‌కి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని మెగా అభిమానులు. మహానటుడు ఏఎన్నార్ చివరి సినిమా "మనం"ను ఘోరంగా అవమానించారని అక్కినేని అభిమానులు.. కులం కారణంగా ప్రభాస్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదని రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. నా రుద్రమదేవి కనీసం జ్యూరీ గుర్తింపుకు కూడా నోచుకోలేదా అంటూ గుణశేఖర్ ఇలా ఒకళ్లా..? ఇద్దరా ..? విమర్శించే వాళ్ల లిస్ట్ పెరుగుతూనే ఉంది తప్ప వీటికి ఎండ్ మాత్రం పడటం లేదు. లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మిది అవార్డులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలయ్య ఈ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.. అందువల్లే తన సినిమాకే అవార్డులన్ని ఇప్పించుకున్నారని ఫిలింనగర్‌లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇక అన్నింటికన్నా మరో ఆసక్తికరమైన కోణం ఎలివేట్ అవుతోంది అదే "కమ్మ" యాంగిల్. ఈసారి అవార్డుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అవార్డ్ దక్కడం వివాదానికి దారి తీసింది. బాలయ్య, ఎన్టీఆర్, మహేశ్, బోయపాటి శ్రీను అంతా కమ్మవారే. దీంతో ఇవి కమ్మ అవార్డులు అంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఇక ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా జ్యూరీ మెంబర్, డైరెక్టర్ మద్దినేని రమేశ్ ‌బాబు ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉంది. వర్మను రాయలేని రీతిలో బండ బూతులు తిడుతూ మద్దినేని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇలాంటి వారినా చంద్రబాబు జ్యూరీ మెంబర్‌గా నియమించేది అంటూ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. మెగా ఫ్యామిలీని పట్టించుకోకపోవడంపై మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.. రాష్ట్రంలోని ఓట్ల శాతంలో వారిదే పైచేయి.. వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు వస్తాయనుకుంటున్న వేళ వారి ఆగ్రహానికి గురికావడం తెలుగుదేశానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంది అవార్డుల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు అందరికీ ఆయనే టార్గెట్ అయ్యారు. మరి వీటిని ముఖ్యమంత్రి ఎలా సరిదిద్దుతారో వేచి చూడాలి.