ఏపీలో ఎన్నికలు కేసీఆర్‌ vs చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డేటా చోరీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై యథేచ్ఛగా కుట్రలు జరుగుతున్నాయని.. ఇంత దారుణమైన కుతంత్రాలు చరిత్రలో ఎప్పుడూ లేవని విమర్శించారు. ‘బాహుబలి’ సినిమాలో చూపించిన దాని కంటే ఇది మహాకుట్ర అని అన్నారు.‘రాష్ట్రంపై కుట్రలు జరుగుతున్నాయి. చేసిన కుట్రలు బయటపడితే ప్రజలు ఛీ కొడతారని కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇవ్వాలని కుట్ర పన్నారు. టీడీపీని నాశనం చేయాలని చూస్తున్నారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులే దీనికి సూత్రధారులు.' అని అన్నారు. ఈ కుట్రకు ఢిల్లీలోనే బీజం పడింది అన్నారు. వైసీపీ కుట్ర ప్రణాళికకు అక్కడి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది అని టీఆర్ఎస్ సర్కార్ ని విమర్శించారు. 'ఐటీ గ్రిడ్‌ నుంచి మా డేటా ఎత్తుకెళ్లిపోయారు. నా డేటా దొంగిలించడానికి వారికి అధికారం ఎవరిచ్చారు. గవర్నర్‌ వద్దకు టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ నాయకులు ఒకరి వెంట ఒకరు వెళతారు. కేసీఆర్‌ వేల కోట్లు రూపాయలు పంపుతారు. ఎందుకంటే ఆయనకు సామంత రాజ్యం కావాలి. ఇక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూడడమే వారి కుట్ర. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆయన కేసుల మాఫీ కోసం టీఆర్ఎస్ తో చేతులు కలుపుతారు. ‘కేసీఆర్‌ కావాలా.. టీడీపీ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలి. జగన్‌ ఆత్మగౌరవం అమ్ముకుని హైదరాబాద్‌కు అమ్ముడుపోయారు. ఆంధ్రా ప్రజలను కేసీఆర్‌ ఎన్నో రకాలుగా అవమానించారు విభజన గాయాలపై కారం పూసి ఆనందిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదు.. వస్తాను, తేల్చుకుంటానని కేసీఆరే చెప్పారు. రేపు ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్‌, టీడీపీ మధ్యే’ అని చంద్రబాబు అన్నారు.